25-11-2025 01:03:24 AM
బీసీల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్సే
బీఆర్‌ఎస్ పార్టీ నేతలు
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46తో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నీళ్లు చల్లిందని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక ప్రహసనంగా మార్చిందని విమర్శించారు. సోమవారం తెలంగణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తూ చివరకు రిజర్వేషన్లపై చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4వ తేదీని సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ 42 శాతం రిజర్వేషన్ సాధించలేదు కనుక దానిని విద్రోహ దినంగా పాటిస్తారా అని ప్రశ్నించారు. 3 వేల కోట్ల నిధుల కోసం నాలుగు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అని నిలదీశారు.
జీవో 46ను వెంటనే రద్దు చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి పార్లమెంట్‌లో రిజర్వేషన్ పెంపునకు ప్రయత్నించాలని సూచించారు. రేవంత్‌రెడ్డి బీసీలకు చేసిన మోసాలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా రంగులు మార్చినట్టుగానే బీసీ రిజర్వేషన్లపై మాటలు మార్చారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు తాయిలాలు ప్రకటించడం మరచిపోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు.
కాంగ్రెస్ చేసిన మోసాలపై దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. బీసీల కోసం నిలబడే పార్టీ బీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు. రకరకాల వేదికల మీద బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీఆర్‌ఎస్ కొట్లాడుతూనే ఉంటుందని తెలిపారు. బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన రేవంత్‌రెడ్డి తగిన ఫలితం అనుభవిస్తారని పేర్కొన్నారు.