25-11-2025 12:21:45 AM
కోకాపేటలో ‘రియల్’ సునామీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి సంచలనం సృష్టించింది. నగర శివారులోని కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో భూములు అక్షరాలా బంగారమయ్యాయి. సోమవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్వహించిన ఈ--వేలంలో ఎకరం భూమి అత్యధికంగా రూ.137.25 కోట్ల రికార్డు ధర పలికి, హైదరాబాద్ రియల్టీ రంగం యొక్క తిరుగులేని శక్తిని మరోసారి రుజువు చేసింది.
కేవలం రెండు ప్లాట్ల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.1,356 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. కోకాపేటలోని నియోపోలిస్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృ ద్ధి చేసిన లేఅవుట్‌లోని ప్లాట్ నెం.17 (4.59 ఎకరాలు), ప్లాట్ నెం.18 (5.31 ఎకరాలు)లకు హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించింది. ఎకరా కనీస ధరను రూ.99 కోట్లుగా నిర్ణయించగా, దేశవ్యాప్తంగా పేరొందిన 10 ప్రముఖ, స్థానిక నిర్మాణ సంస్థలు ఈ వేలంలో పాల్గొన్నాయి.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం ప్రక్రియ, తీవ్రమైన పోటీ కారణంగా సాయంత్రం 4 గంటల వరకు హోరాహోరీగా సాగింది. తుదిపోరులో 5.31 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నెం.18ను ఎంఎస్‌ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్‌ఎల్‌పి సంస్థ ఎకరాకు రూ.137.25 కోట్ల చొప్పున దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన వేలంలో 4.59 ఎకరాల ప్లాట్ నెం.17ను వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి సంస్థ ఎకరాకు రూ.136.50 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది.
మొత్తంగా ఈ 9.90 ఎకరాల వేలం ద్వారా హెఎండీఏకు రూ.1,356 కోట్ల ఆదాయం వచ్చింది. 2023లో ఇదే నియోపోలిస్‌లో నిర్వహించిన వేలంలో ఎకరం సగటు ధర సుమారు రూ.73 కోట్లుగా ఉండగా, తాజా వేలంలో పలికిన ధర ఏకంగా 87 శాతం అధికం కావడం విశేషం. ఇది హైదరాబాద్ పశ్చిమ కారిడార్‌పై పెట్టుబడిదారులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని, ఈ ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో స్పష్టం చేస్తోందని హెఎండీఏ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇటీవలే రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరా రూ.177 కోట్లు పలకగా, తాజాగా కోకాపేట వేలం సైతం ఆ రికార్డుల సరసన నిలిచింది. ఓ వైపు అంతర్జాతీయ హంగులతో కూడిన లేఅవుట్, రెండు కిలోమీటర్ల దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్, మరోవైపు ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో ఈ భూములకు ఇంతటి భారీ డిమాండ్ ఏర్పడిందని రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రారంభంతో, నవంబర్ 28, డిసెంబర్ 3 నియోపోలిస్, డిసెంబర్ 5 గోల్డెన్ మైల్, తేదీల్లో జరగబోయే తదు పరి వేలాలపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.