03-07-2024 04:14:40 AM
న్యూఢిల్లీ, జూలై 2: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మీద లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నిన విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ నెలలోనే ఈ గ్యాంగ్ హీరో ఇంటి మీద కాల్పులు కూడా జరిపింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు సందర్భంగా ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ స్టార్ హీరోను కారులోనే అంతం చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా ప్రయత్నించిందని, అందుకోసం రూ. 25 లక్షల కాంట్రాక్టు కూడా ఇచ్చినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయనను హతమార్చేందుకు టర్కీ నుంచి ప్రత్యేక ‘జిగాన’ తుపాకులను కూడా తెప్పించారట. సింగర్ సిద్ధు మూసేవాలా హత్య కూడా ఇదే విధంగా జరిగింది. ఇందుకోసం షార్ప్ షూటర్లయిన కొంత మంది మైనర్లను వాడుకోవాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసిందట.
అసలేంటీ ‘జిగాన’ తుపాకులు
జిగాన తుపాకులు ఏమిటని అంతా ఆరాతీస్తున్నారు. టర్కీకి చెందిన ‘టిసాస్’ అనే కంపెనీ ఈ తుపాకులను తయారుచేస్తుంది. ఇవి సెమీహో తుపాకులు. వీటి ధర కూడా రూ. 6 లక్షల పైమాటే. ఈ తుపాకులను టర్కీ సైన్యంతో పాటు సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా వాడుతున్నాయి. ఇండియాలో మాత్రం ఈ తుపాకుల వాడకం మీద నిషేధం అమల్లో ఉంది. అయినా కానీ వీటిని వాడి స్టార్ హీరో సల్మాన్‌ను అంతం చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నాలు చేసిందని తెలియడంతో పోలీసులతో పాటు సెలబ్రెటీలు కూడా ఒక్కసారిగా షాక్ అ య్యారు.
ఈ కుట్రను అమలు చేసేందుకు బిష్ణోయ్, సంపత్ నెహ్రా గ్యాంగులకు చెందిన దాదాపు 70 మంది సభ్యులతో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయగా.. వీరంతా సల్మాన్ ఖాన్ కదలికలపై నిఘా ఉంచినట్లు పోలీసు లు వెల్లడించారు. సల్మాన్ నివాసంతో పా టు, ఆయన ఫామ్‌హౌస్ మీద కూడా ఈ నెట్‌వర్క్ సభ్యులు నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
చంపేసి.. పారిపోయేలా ప్లాన్
సల్మాన్ ఖాన్‌ను చంపేసేందుకు ఈ గ్యాంగ్స్ మైనర్లను సిద్ధం చేసింది. ఈ మైనర్లు గ్యాంగ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సల్మాన్‌ను చంపేసిన తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేందుకు వీరు స్కెచ్ వేసుకున్నట్లు తేటతెల్లమైంది. సల్మాన్‌పై ఎలా దాడిచేయాలో సూచిస్తున్న వీడియోలు కూడా లభ్యం అయినట్లు డీసీపీ వివేక్ పన్సారే పేర్కొన్నారు.