26-11-2025 06:00:10 PM
సీనియర్ న్యాయవాది దంతాల ఆనంద్ ను సన్మానించిన వాకర్స్ క్లబ్ సభ్యులు..
ఇల్లెందు (విజయక్రాంతి): భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26వ తేదీన నిర్వహించే రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా సింగరేణి గ్రౌండ్‌లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇల్లందు సీనియర్ న్యాయవాది, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు దంతాల ఆనంద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరూ సత్వర న్యాయం, సమానత్వం, స్వాతంత్రం వంటి రాజ్యాంగబద్ధమైన మౌలిక విలువలను పాటిస్తూ జీవించాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులు మాత్రమే కాక, విధులనూ గుర్తించి దేశాభివృద్ధి పట్ల ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని వివరించారు. రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన సుదూర దృష్టి, సమానత్వంపై నమ్మకం దేశ ప్రగతికి మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. అనంతరం దంతాల ఆనంద్ ని వాకర్స్ క్లబ్ సభ్యులు మెమొంటో అందజేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు, గాయత్రి పరివార్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.