calender_icon.png 6 November, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ జరగాల్సిందే

06-11-2025 07:18:46 PM

బీసీ రిజర్వేషన్లపై పోరాటాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం.                                                 

బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్  

హనుమకొండ (విజయక్రాంతి): జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం హన్మకొండలో అంబేద్కర్ జంక్షన్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద  విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి,నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ జనాభాలో 10 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని, అన్ని రంగాలను శాసిస్తూ, బీసీలను అణగదోక్కుతున్నారని  మండిపడ్డారు.

జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను, ఓట్లు వేసే యంత్రాలు గానే మిగిలిపోతున్నారన్నారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే, మద్దతునిచ్చిన బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లే పల్లేకు విస్తరించి బిజెపికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదన్నారు. దగాపడ్డ బీసీలు దండు కట్టే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళనున్నట్లు వేణుగోపాల్ గౌడ్ వెల్లడించారు.

డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపడతామని, జనవరి 4వ వారంలో లక్ష మందితో వేల వృత్తులు, కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ  కార్యక్రమంనికి లంబాడి హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపాయి.ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, బీసీ జేఏసీ మహిళా నాయకురాలు తమ్మేలా శోభరాణి, మాదం పద్మజదేవి, తెల్ల సుగుణ, హైమావతి, కిషోర్ బీసీ జేఏసీ జిల్లా నాయకులు బచ్చు ఆనందం, దాడి రమేష్ యాదవ్,  గొట్టే మహేందర్, డా. ఒడితల రాము, తంగళ్లపెల్లి రమేష్, పంజల మధు గౌడ్, జ్ఞానేశ్వర్, రజనీకాంత్, పొన్నం సంపత్, చాగంటి రమేష్  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు