16-05-2025 12:51:18 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
భీమదేవరపల్లి, మే 15 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతంగా వర్షాలు పడక ముందే పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గోదాంల వద్ద నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇప్పుడు వరకు చేపట్టిన ధాన్యం కొనుగోలు, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో ఎన్ని మిల్లులు ట్యాగ్ అయి ఉన్నాయి, ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలకు డబ్బులు జమా అవుతున్నాయా, ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇంకా ఎన్ని గన్నీ బ్యాగులు ఉన్నాయి, ఒక్కో గన్ని బ్యాగుకు ఎంత ధర పడుతుందనే వివరాలను అధికారులు, నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇదే మండలంలోని వీర నారాయణపూర్ లో తొలి విడత మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ గ్రామానికి చెందిన లబ్ధిదారులు సౌందర్య, సుశీల ఇండ్ల నిర్మాణానికి మెటీరియల్ను ఎక్కడినుండి తీసుకు వస్తున్నారు, ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చయిందని, ఎప్పటి వరకు పూర్తి చేస్తారని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒకే రేటు ప్రకారం చేస్తున్నారా లేదా అని లబ్ధిదారులతో మాట్లాడి కలెక్టర్ తెలుసుకున్నారు.
అదేవిధంగా గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు బేస్ మెంట్ లెవెల్ వచ్చాయని, ఆ దశకు వచ్చిన వాటిని బిల్లు చెల్లింపు కోసం ఆన్లైన్ చేస్తున్నారా, ఈ గ్రామంలో ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని, ఇంకా మొదలుపెట్టని ఇండ్లను ఎప్పటినుండి ప్రారంభిస్తారని గృహ నిర్మాణ శాఖ డి ఈ సిద్ధార్థ నాయక్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతోనూ జిల్లా కలెక్టర్ మాట్లాడారు.