calender_icon.png 7 May, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ

07-05-2025 01:28:42 AM

  1. చైర్మన్‌గా నవీన్ మిట్టల్, సభ్యులుగా లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్
  2. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశం
  3. నేడు తెలంగాణ ఉద్యోగ జేఏసీతో కమిటీ భేటీ
  4. కమిటీ వేయడంపై హర్షం వ్యక్తంచేసిన ఉద్యోగులు

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘ కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యా య, కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కమిటీ వేసింది. ముగ్గు రు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ సమస్యల పరిష్కారం కోసం పెన్‌డౌన్ చేస్తామని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల జేఏసీ ప్రకటించిన విష యం తెలిసిందే.

ఈక్రమంలో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించేందుకు కమిటీ వేసింది. ఈకమిటీలో చైర్మన్‌గా నవీన్ మిట్టల్, సభ్యులుగా లోకేశ్‌కుమార్, కృష్ణభాస్కర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తింపు కలిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వారం రోజుల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

నిర్ధిష్టమైన డిమాండ్లు, అంశాలపై ఆచర ణీయమైన సిఫార్సులు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈనేపథ్యంలో అధికారుల కమి టీ బుధవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలతో భేటీకానుంది. ఈసమావేశానికి టీజీవో, టీఎన్జీవో, టీచర్ సంఘాలు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘం నేతలు హాజరుకానున్నారు. సమావేశంలో ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, రూ.10వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు, పీఆర్సీ నివేదికలాంటి ఆర్థికపరమైన అంశాలతోపాటు ఆర్థికేతర 45 అంశాలపైన చర్చించనున్నారు.

హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు

పోరుబాట పడతామని ఉద్యోగుల జేఏసీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రగతి బాగోలేదని, అప్పు పుట్టడంలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు యుద్ధం ఎవరిపై చేస్తారని, ప్రజలపైనా? అని మండిపడ్డారు. ఉద్యోగులు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

అయితే సీఎం చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు..తాజాగా ప్రభుత్వం కమిటీ వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్‌ను మంగళవారం తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు చావ రవి, బీ శ్యామ్, పుల్గం దామోదర్‌రెడ్డి, వంగా రవీందర్‌రెడ్డి, ముజీబ్ హుస్సేన్, సత్యనారాయణ, ఏ పరమేశ్వర్‌రెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.