calender_icon.png 20 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాండ్ బజార్‌తో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ

20-11-2025 12:08:28 AM

మంత్రి వివేక్ వెంకటస్వామి 

చెన్నూర్, నవంబర్ 19 : సాండ్ బజార్ ఏర్పాటు ద్వారా ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మండలంలోని బావురావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్యలతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత ఏడాది కంటే 18 శాతం అధికంగా పన్ను వసూలు జరిగిందని, ఈ అభివృద్ధిలో అధికారుల పాత్ర అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. నియోజక వర్గంలోని సోమనపల్లిలో 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలలో అవసరమైన మరమ్మత్తులు, ఆర్. ఓ. ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చెన్నూర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనుల కొరకు 2 కోట్ల 50 లక్షల రూపాయలు, జూనియర్ కళాశాల కోసం కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. చెన్నూర్ లో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని తెలిపారు. చెన్నూరు ప్రాంతంలో డయాలసిస్ ప్లాంట్ ఏర్పాటు చేసి 6 యంత్రాల ద్వారా బాధితులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని, గ్రామాలలో సోలార్ లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుక తరలింపులో జాగ్రత్తలు వహిస్తున్నామని తెలిపారు. ఇందారం ప్రాంతం నుండి మందమర్రి, భీమారం, జైపూర్ ప్రాంతాలకు, కోటపల్లి నుండి టి జి ఎం డి సి ద్వారా వినియోగదారులకు ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్ లో అందిన వివరాల ప్రకారం వినియోగదారులకు ఇసుక పంపిణీ జరుగుతుందన్నారు. 

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని రైతు వేదికలో అధికారులతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం చెన్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో డివిజన్, మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో  శ్రీనివాస్ రావు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.