24-07-2025 01:00:21 AM
న్యూఢిల్లీ, జూలై 23: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశం బుధవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్‌ఐఆర్) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు అట్టుడికాయి. ప్రతిపక్షాల నిరసనల హోరుతో మూడో రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు గురువారం 11 గంటలకు వాయిదా పడ్డాయి.
ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవగానే.. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన గళం వినిపించారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఆగమేఘాల మీద జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు మండిపడ్డారు. తీరా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిందని విమర్శించారు.
ఓటర్ల జాబితా సవరణ అంశంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు డిమాండ్ చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నిరసనలు ఆగకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
దీంతో అధికార పక్షం చర్చకు భయపడుతుందని పేర్కొంటూ పార్లమెంట్ బయటకు వచ్చిన ప్రతిపక్ష ఎంపీలు ప్రియాంక గాంధీ, కనిమొళి, జయాబచ్చన్ సహా తదితర ఎంపీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 29న ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్‌పై సుదీర్ఘ చర్చ జరగనుంది.
లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటలు దీనిపై ఎంపీలు మాట్లాడనున్నారు. సభ వాయిదా ముందు ప్రభుత్వం రెండు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) , జాతీయ క్రీడా పాలన బిల్లు 2025ను కేంద్ర మంత్రి మాండవీయ ప్రవేశపెట్టారు.
ట్రంప్ 25 సార్లు ఆ మాట అన్నారు: రాహుల్
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 సార్లు చెప్పారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం ఏమని చెబుతుంది. ట్రంప్ కాల్పుల విరమణ చేయించారనా..? కానీ అలా చెప్పలేరు. కాల్పుల విరమణ చేయించినట్టు 25 సార్లు ట్రంప్ చెప్పారు. అసలు ట్రంప్ ఎవరు? అది ఆయన పని కాదు. ప్రధాని దీనిపై సమాధానం ఇవ్వాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.