19-11-2025 12:00:00 AM
నివేదికతో బహిర్గతమైన మిన్నకుండిన అధికారులు
విస్మయం వ్యక్తం చేస్తున్న భక్తులు
ఘటనపై విచారణ జరపాలని వినతి
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 18 (విజయక్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్టోర్ రూమ్ నుంచి సామగ్రి మాయం కావడం కలకలం రేపింది. ప్రతిరోజు అన్నప్రసాదం, లడ్డూ, పులిహోరకు ఉపయోగించే సామగ్రి అపహరణ గురికావడం, దీనిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తుండడం విమర్శలకు దారితీస్తున్నది.
రాజన్న ఆలయ అనుబంధ దేవాలయాలతోపాటు సెంట్రల్ గోదాం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వెంకట ప్రసాదరాజు ఈ సంఘటనపై మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కమిటీ నివేదిక ఇచ్చి రెండు వారాలు దాటుతున్నా నివేదికను బయట పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. సూపరింటెండెంట్ వెనుక ఒక బడా రాజకీయ నాయకుని హస్తం ఉండడం వల్లే అతనిపై చర్యలకు ఈవో వెనుకంజ వేస్తున్నాడని తెలిసింది.
కమిటీ నివేదికలో 14 రకాల వస్తువులు తక్కువగా వచ్చాయి. నువ్వులు, మినపప్పు, జీలకర్ర, కాజు, కిస్మిస్, యాలకులు, జెమిని చాయపత్తా, బఠాణీలు, జాజికాయ, పచ్చ కర్పూరం, అలసందలు, ఉలువలు, పల్లీలు, దొడ్డు శెనగలు తస్కరించినట్లు స్పష్టమైంది. ఈ వస్తువులను స్టోర్ రూమ్ నుంచి కారులో తరలిస్తున్న దృశ్యాలు సీసీ పుటేజీలో నిక్షిప్తమైనప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సెంట్రల్ గోదామ్‌లో వస్తువులు మాయమైనట్లు ప్రచారం జరగడంతో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో కమిటీ నివేదిక సమర్పించింది.నివేదికలో 7 కిలోల 770 గ్రాముల నువ్వులు, 3కిలో 825 గ్రాముల మినపప్పు, 5 కిలోల 450 గ్రాముల జీలకర్ర, కిస్మస్ 4 కిలోల 948 గ్రాములు, జెమిని చాయపత్తా 4 కిలోలు, బఠాణీ 12 కిలోల 340 గ్రాములు, అలుసదలు 18 కిలోల 850 గ్రాములు, పల్లీలు 6 కిలోల 820 గ్రాములు, దొడ్డు శెనగలు 12 కిలోల 300 గ్రాముల వ్యత్యాసం కనిపించింది.
ఆలయ ఈవో రమాదేవి మాత్రం ఇలాంటి సంఘటన జరగలేదని చెబుతుండగా, సిబ్బంది సంచిలో తీసుకువెళ్తుంది సిలిండర్ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఒక నెలలోనే ఇంత వ్యత్యాసం ఉంటే సంవత్సరంలో ఎన్ని వస్తువులు మాయమవుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని భక్తులు కోరుతున్నారు.