16-08-2024 01:36:09 AM
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్
గాంధీభవన్‌లో జెండావిష్కరణ
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): ఎందరో మహానీయుల త్యాగ ఫలితంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఉద్యమంతో సంబంధంలేని వాళ్లు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ జాతీ య జెండాను ఆవిష్కరించారు. కార్పొరేట్ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. జోడో యాత్ర, న్యాయ్ యాత్రతో రాహుల్‌గాంధీ దేశ ప్రజల గుండెల్లో నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి పీసీసీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి హామీ అమలు చేస్తున్నాం: వీహెచ్
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు చెప్పారు. యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రైతు రుణమాఫీ చేశారని, ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కులగణన చేయాలని కోరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కోదండరెడ్డి, కుమార్‌రావు, గొపిశెట్టి నిరంజన్, మెట్టు సాయికుమార్, సేవాదల్ చైర్మన్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
జెండాతో టూ వీలర్‌పై వీహెచ్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీహెచ్ జాతీయజెండాను పట్టుకుని తన అనుచరులతో కలిసి టూవీలర్లపై తిరుగుతూ హల్‌చల్ చేశారు. 72 ఏళ్ల వయసులో స్కూటర్‌పై కూర్చొని యువకుడిలా నగరంలో తిరిగారు. తన నివాసం అంబర్‌పేట నుంచి ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం, అక్కడి నుంచి తన నివాసానికి చేరుకున్నారు.