16-08-2024 01:36:01 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుద్ధరణ సుందరీకరణ పనులు క్రమేపీ వేగం పుంజుకుంటున్నాయి. మూసీ సుందరీకరణకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఒక విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ను సాంకేతిక కారణాలతో ఎంఆర్‌డీసీఎల్ అధికారులు రద్దు చేశారు. దీంతో ఎంఆర్‌డీసీఎల్ ఇంజినీరింగ్ అధికారులు మరోసారి బిడ్డింగ్ కోసం మంగళ వారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు.
9 వేలకు పైగా నిర్మాణాలు..
ప్రస్తుతం మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ధేశించబడి ఉంది. ఈ నేపథ్యంలో మూసీకి ఇరువై పులా ఉన్న నిర్మాణాలు, ఆ ప్రాంతంలోని నివాసితుల సామాజిక, ఆర్థిక అంశాలపై రెవెన్యూ అధికారులతో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ సర్వే ఇప్పటికే దాదాపుగా పూర్తయి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించేందుకు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. గండిపేట అత్తాపూర్, అత్తాపూర్ నాగోల్, నాగోల్ గౌరవెల్లి దాకా మూడు విభాగాలుగా విభజించి ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను అధికారులు తయారు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం.
ఈ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులతో చేపట్టిన సర్వేలో దాదాపుగా 9 వేలకు పైగా నిర్మాణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సర్వేలో గుర్తించిన పెద్ద పెద్ద భవనాల యజమానులతో భూసేకరణ విషయమై ఎంఆర్‌డీసీఎల్ అధికారులు సంప్రదింపులు జరపగా, ప్రభుత్వ ఆదేశాలను పాటించేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
12న ఫైనల్ కానున్న బిడ్డింగ్..
గత బిడ్డింగ్ ప్రక్రియలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లో పాల్గొన్న 7 ఏజెన్సీలను ఎంఆర్‌డీసీఎల్ బిడ్డింగ్‌కు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే, బిడ్డింగ్ ఖరారు చేయడానికి నిర్వహించే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)కు మాత్రం 7 ఏజెన్సీలలో 5 మాత్రమే అటెండ్ అయ్యాయి. ఈ బిడ్డింగ్‌ను సాంకేతిక కారణాలతో అధికారులు రద్దు చేశారు. దీంతో బిడ్డింగ్‌ను తిరిగి ఫైనల్ చేసేందుకు మూసీ అధికారులు మరోసారి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌కు నోటిఫికేషన్ విడుల చేశారు.
ప్రస్తుతం జరగబోయే బిడ్డింగ్‌లో 7 ఏజెన్సీలలో ఎన్ని ఏజెన్సీలు హాజరవుతాయో చూడాల్సి ఉంది. ఈ నెల 23న ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈవోఐ)కు దరఖాస్తు చేసిన 7 ఏజెన్సీలతో ప్రస్తుత నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రీ బిడ్డింగ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మీటింగ్ అనంతరం సెప్టెంబరు 12న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను అధికారులు ఓపెన్ చేయనున్నా రు. దీని తర్వాతనే మూసీ బిడ్డింగ్‌కు ఏజెన్సీ ఖరారు కానున్నట్టు అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.