calender_icon.png 20 November, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ, అంబేడ్కర్ స్ఫూర్తితోనే ఉద్యమం

16-08-2024 01:37:18 AM

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలి 

రేవంత్‌రెడ్డి, చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేస్తాం 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 

హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలను నిర్మూలించినప్పుడే స్వాతంత్య్రాన్ని సంపూర్ణం చేసుకోగలమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గాంధీ, అంబేడ్కర్ స్ఫూర్తితోనే ఎమ్మార్పీస్ ఉద్యమం సుదీర్ఘంగా జరిగిందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో మందకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సాధనలో ఎంతోమంది వీరుల త్యాగాలున్నాయన్నారు. దేశ సంపద అన్ని వర్గాలకు పంపిణీ జరిగినప్పుడే ప్రజల సామాజిక, జీవన స్థితిగతుల్లో మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం కొనసాగిందని, లక్ష్యాన్ని సాధనకు క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించామన్నారు.

ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి కొంతమంది దోపిడిదారులు చేసే అధర్మ ప్రయత్నాలు ఎప్పటికి చెల్లవని హెచ్చరించారు. క్రీమీ లేయర్ అంశాన్ని అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తులు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని, క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు జడ్జిలు తమ అభిప్రాయం మాత్రమే చెప్పారని, తీర్పు కాదనే విషయం గుర్తించుకోవాలని హితవు పలికారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేశ్‌మాదిగ, మాజీ ఎమ్మెల్యే పద్మాజ్యోతి, డాక్టర్ సుబ్బారావు, తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, సుధాకర్‌తో పాటు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు