07-05-2025 08:58:35 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య...
హనుమకొండ (విజయక్రాంతి): నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు నివారణ మందుల అమ్మకాలలో వరంగల్ జిల్లాకు మంచి పేరు ఉందని, ఇదే విధానంలో విత్తన, ఎరువులు, పెస్టిసైడ్స్ డీలర్లు ముందుకు సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య(District Collector P. Pravinya) అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సీడ్, ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ డీలర్స్, వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నాణ్యమైన విత్తనాలు, ఎరువుల విక్రయాలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించి నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించినట్లయితే చట్ట ప్రకారం డీలర్లపై తీసుకునే కఠిన చర్యలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విత్తన, ఎరువుల డీలర్లు దుకాణదారులకు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ... సీడ్స్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ విక్రయాలకు సంబంధించి వరంగల్ కు ఒక నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని కొనసాగించాలని అన్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారని అన్నారు. రైతులు కొనుగోలు చేసిన దానికి బిల్లులు తప్పనిసరిగా డీలర్లు ఇవ్వాలన్నారు. డీలర్లు తమ దుకాణాల ద్వారా చేపట్టే విత్తన, ఎరువులు, పురుగు మందుల క్రయవిక్రయాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు చేయాలన్నారు.
అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు సంబంధిత రికార్డులను చూపించాల్సి ఉంటుందన్నారు. నకిలీ విత్తన, ఎరువులు, పురుగు మందుల గురించి ఏదైనా సమాచారం వస్తే వెంటనే టాస్క్ఫోర్స్ కమిటీ అధికారులకు అందించాలన్నారు. ఒక్క రైతుకు కూడా నష్టం రావొద్దన్నారు. సీజన్ లో ఎక్కడ కూడా విత్తన ఎరువులు పురుగు మందులకు కొరత, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని డీలర్లకు తెలియజేశారు.పలువురు డీలర్లకు ఇ-పాస్ మిషన్ల ను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, సతీష్ బాబు, ఇతర అధికారులు, సీడ్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ డీలర్లు, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.