24-01-2026 01:03:25 AM
ఆధారాలు, రికార్డులు చూపించే ప్రశ్నించాం
సిట్ దర్యాప్తు పారదర్శకం
బయటి ప్రచారంతో సిట్‌కు సంబంధం లేదు: సీపీ సజ్జనార్
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 23 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ తీరుపై సీపీ సజ్జనార్ సంచలన విషయాలను వెల్లడించారు. కేటీఆర్‌ను ఏదో ఉపరితల విచారణ జరిపి పంపించలేదని, పక్కా ఆధారాలు, రికార్డులను ముందు ఉంచి మరీ ప్రశ్నించామన్నారు. ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతోందని తెలిపారు. కేటీఆర్ విచారణ సందర్భం గా దర్యాప్తు అధికారులు అనుసరించిన తీరు ను వివరించారు. కేవలం ఆరోపణల ఆధారంగా కాకుండా, మా లిఖిత పూర్వక, సాంకేతిక ఆధారాలను, రికార్డులను కేటీఆర్ ముందు ఉంచాం. వాటిని చూపిస్తూనే ఒక్కో అంశంపై ఆరా తీశాం.
విచారణలో భాగంగా ఆయన చెప్పిన సమాధానాలను రికార్డు చేశాం అని సీపీ పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అవసరమనిపిస్తే కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలుస్తామని తేల్చిచెప్పారు. కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రభావితం చేయకూడదని, వారిని బెదిరించడం లేదా ప్రలోభపెట్టడం వంటి చర్యలకు పాల్పడవద్దని కేటీఆర్‌కు స్పష్టంగా చెప్పినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బయట జరుగుతున్న ప్రచారంపై కూడా సీపీ స్పందించారు. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో వస్తున్న తప్పు డు వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ‘బయట జరుగుతున్న ప్రచారానికి, సిట్ దర్యాప్తునకు సంబంధమూ లేదు. చట్టప్రకారమే వెళ్తు న్నాం. ఊహాగానాలతో దర్యాప్తును తప్పుదోవ పట్టించొద్దు’ అని విజ్ఞప్తి చేశారు.