16-09-2025 10:56:07 PM
ప్రజాభవన్ ప్రజావాణిలో సీపీఐ నాయకుల ఫిర్యాదు
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో దర్జాగా అక్రమ విల్లాల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బాచుపల్లి మండలం సీపీఐ కార్యదర్శి శ్రీనివాస్ సోమవారం ప్రజా భవన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాచుపల్లి మండలం నిజాంపేట్ సర్వే నెంబర్ 233/15 లో ప్రైవేట్ సర్వే నెంబర్ 274 ను చూపిస్తూ ఇందిరమ్మ కాలనీ ఫేస్-3 బ్లాక్ నెంబర్ 21,22 వెనుకాల గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొందరు అక్రమంగా విల్లాలను నిర్మిస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు గత పాలకవర్గంలో కీలకంగా పనిచేసిన ఓ నేత తప్పుడు డాక్యుమెంట్స్ తో లింక్ డాక్యుమెంట్స్ సృష్టించి లేని ప్లాట్స్ ఉన్నవిగా చూపిస్తూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారన్నారు.
గత అధికార పార్టీ అండతో పొలిటికల్ పలుకుబడిని ఉపయోగించి సదరు నిజాంపేట్ నాయకుడు ప్రభుత్వ స్థలం కాజేస్తూ ధర్జాగా విల్లాల ను నిర్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఈ విల్లాల విలువ సుమారు 5 కోట్లు పలుకుతుంది.అయితే ఈ ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఇప్పటికే బాచుపల్లి తహసీల్దార్ రెవెన్యూ కార్యాలయం,నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ కబ్జాపై తరచుగా ఫిర్యాదులు రావడం తో మున్సిపల్ కమిషనర్ విల్లాల నిర్మాణం కోసం గత కమిషనర్ ఇచ్చిన అనుమతులు రద్దు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఆశి యాదయ్య, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.