calender_icon.png 17 September, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమార్జనలో అదుర్స్

17-09-2025 12:58:44 AM

  1. రూ.92 లక్షల నగదు.. రూ.కోటి విలువైన ఆభరణాలు సీజ్
  2. ఆమెకు సహకరించిన ఉద్యోగి నివాసంలోనూ సోదాలు

దిస్పూర్, సెప్టెంబర్ 16: అస్సాంకు చెందిన ఓ మహిళా సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. కళ్లు చెదిరే కోట్ల విలువైన ఆభరణాలు పట్టుబడ్డాయి. భూకుంభకోణంపై సదరు అధికా రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారులు దాడులు నిర్వహించారు. నాలుగు చోట్ల నివాసాల్లో మొత్తం రూ.92 లక్షల నగదుతో పాటు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

బార్‌పేట లోని ఆమె ఉంటున్న అద్దె ఇంటిలో రూ.10 లక్షల నగదు పట్టుకున్నారు. ఆమెకు సహకరించిన ఓ ఉద్యోగి నివాసంలోనూ సోదాలు చేశారు. గోలాఘట్‌కు చెందిన నుపూర్ బోరా 2019లో (ఏసీఎస్) సివిల్ సర్వీస్ అధికారిణిగా విధుల్లో చేరారు.  ప్రస్తుతం ఆమె కామ్‌రూప్ జిల్లాలోని గొరైమారిలో సర్కిల్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. బార్పేట్ జిల్లా సర్కిల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమె భారీగా భూకుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.

ఓ వర్గానికి చెందిన భూములను లంచంగా తీసుకుని మరికొందరికి కట్టబెట్టారనే ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వకర్మ సైతం ఆరోపణలు చేశారు. దీంతో ప్రత్యేక విజిలెన్స్ సెల్ ఆమె కదలికలపై ఆరు నెలల నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే సోమవారం ఆమె నివాసంతో పాటు మరో మూడుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

నుపూర్ బోరాకు సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్పేట్ రెవెన్యూ అధికారి లత్ మండల్ సురాజిత్ డేకా నివాసంలోనూ దాడులు నిర్వహించారు. దాడులపై సీఎం స్పెషల్ విజిలెన్స్ ఎస్పీ రోజీ కలిత స్పందిస్తూ.. నుపూర్‌బోరాపై ఎన్నో అవినీతీ ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో మరిన్ని చీకటి కోణాలను బయటపడతామని వెల్లడించారు. అక్రమాల్లో రెవెన్యూ అధికారి సురజిత్ పాత్రపై అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

అనకొండకు కరెంట్ షాక్

  1. విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై ఏసీబీ రైడ్
  2. రూ.2 కోట్లకు పైగా నగదు, భారీగా ఆస్తులు గుర్తింపు
  3. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్
  4. అక్రమ ఆస్తుల మార్కెట్ విలువ రూ. 200 కోట్లు! 

హైదరాబాద్, సిటీ బ్యూరో, రంగారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఇబ్రహీంబాగ్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ)గా పనిచేస్తున్న అంబేద్కర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో 15 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో అంబేద్కర్ కూడబెట్టిన, కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటపడటంతో అధికారులు నివ్వెరపోయారు.

ఏడీఈ అంబేద్కర్ నివాసం కొండాపూర్‌లోని మ్యాగ్న లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వరుసగా సోదాలు కొనసాగాయి. ఏడీఈ బినామీ బంధువు సతీష్ ఇంట్లో రూ. 2.18 కోట్ల నగదును అధికారులు గుర్తించారు.

సోదాల్లో హైదరాబాద్‌లో ఆరు రెసిడెన్షియల్ ప్లాట్స్, శేరిలింగంపల్లిలో ఒక ప్లాట్, గచ్చిబౌలిలో జి ప్లస్ 5 బిల్డింగ్, ఒక విల్లాతో పాటు సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ ప్రాంతంలో 10 ఎకరాల్లో అమర్ కెమి కల్స్ పేరిట కంపెనీ, 1000 గజాల ఫామ్ హౌస్, రెండు ఫోర్ వీలర్ వాహనాలు, బంగారు ఆభరణాలు బ్యాంకు డిపాజిట్లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అక్రమ ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం రూ. 200 కోట్ల పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

సోదాలు కొనసాగుతున్నాయి: ఏసీబీ డీఎస్పీ

ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మాట్లాడుతూ, ఏడీఈ అంబేద్కర్ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి, 15 చోట్ల సోదాలు నిర్వహిం చాం. ఆయన అవినీతి సొమ్మును కూడబెట్టేందుకు సహకరించిన వారి ఇళ్లలో కూడా తనిఖీలు చేశాం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి అని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం అంబేద్కర్‌ను కోర్టులో హాజరుపరుస్తామని ఆయన వెల్లడించారు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి వద్ద ఇంతటి భారీస్థాయిలో అక్రమాస్తులు బయటపడటం విద్యుత్ శాఖలో పాతుకుపోయిన వ్యవస్థీకృత అవినీతికి అద్దం పడుతోంది.

ఈ ఆస్తులు బినామీల పేరిట కూడా ఉండవచ్చని, అక్రమార్జనను వ్యాపారాల్లోకి మళ్లించి ఉండవచ్చని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తును ముమ్మ రం చేశారు. అవినీతికి సంబం ధించిన సమాచారం ఉంటే ప్రజలు టోల్-ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ కేసు దర్యాప్తు పూర్తయితే, విద్యుత్‌శాఖలోని మరిన్ని అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆస్తుల చిట్టా.. అక్రమాల పుట్ట...

అంబేద్కర్, అతని బంధువులు, సన్నిహితులకు చెందిన ప్రాంతాల్లో ఏసీబీ జరిపిన తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు.

నగదు..

అంబేద్కర్ బంధువు ఇంట్లో ఏకంగా రూ.2 కోట్ల పైచిలుకు నగదును స్వాధీనం చేసుకోగా, ఆయన కారులో మరో రూ.5.50 లక్షలు లభ్యమయ్యాయి.

భూములు..

పెద్ద మొత్తంలో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాల ను స్వాధీనం చేసుకున్నారు.సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల భూమిలో ఒక రసాయన కంపెనీ (ఆంథర్ కెమికల్స్) 

భవనాలు..

గచ్చిబౌలిలో ఐదంతస్తుల భవనం, శేరిలింగంపల్లితో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో మొత్తం ఆరు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు.

పెట్టుబడులు..

బ్యాంకు ఖాతాల్లో రూ.78 లక్షల బ్యాలెన్స్, షేర్లలో మరో రూ.36 లక్షల పెట్టుబడులు.

ఇతరాలు..

 రెండు కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రతిపనికి లంచం..!

ప్రైమ్ లొకేషన్స్‌లో పోస్టింగ్

వినియోగదారులకు ‘షాక్’

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంబాగ్ ఏడీఈగా అంబేద్కర్ బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. ఈయన పరిధిలో కోకాపేట్, మణికొండ, నార్సింగి, వట్టినాగులపల్లి మంచి ప్రైమ్ లొకేషన్స్ కావడంతో అక్రమార్జనపై దృష్టిపెట్టారు. హై రైజ్ బిల్డింగులు, గేటెడ్ కమ్యూనిటీలు, వెంచర్‌లలో విద్యుత్ అనుమతులు, నూతన ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు కోసం వినియో గదారుల నుంచి ప్రతి పనికి ఒక రేట్ పిక్స్ చేసి, ముక్కుపిండి వసూలు చేసేవారని ఏడీఈపై పలు ఆరోపణలు ఉన్నాయి.