calender_icon.png 17 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడుబడ్డ భవనంలో ‘పంచాయతీ’!

17-09-2025 12:48:24 AM

పొంచి ఉన్న ప్రమాదం

మహబూబాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): గ్రామాల్లో శిధిలమైన భవనాలు ఉంటే ప్రజలకు ప్రాణాపాయం కాకుండా తొలగించాల్సిన పంచాయతీ అందుకు భిన్నంగా పాడుబడ్డ భవనంలో కొనసాగుతున్న పరిస్థితి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి అన్ని విధాలుగా సేవలు అందించాల్సిన గ్రామపంచా యతీ కార్యాలయ భవనం పూర్తిగా శిథిలం కావడంతో అందులో కార్యనిర్వహణ చేయడం కష్టతరంగా మారింది. ఇనుగుర్తి శివారు అయ్యగారి పల్లి గ్రామాన్ని 2016లో అప్పటి ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీగా ప్రకటించింది.

దీంతో ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థకు చేరిన ఒక భవనాన్ని పంచాయతీ కార్యాలయానికి తాత్కాలిక వినియోగం కోసం ఇచ్చారు. అందులోనే నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యాలయాన్ని అప్పటి మంత్రి చందులాల్ ప్రారంభించారు. పంచాయతీగా ఏర్పడి దాదాపు దశాబ్దం కావస్తున్నా కొత్తగా ఏర్పడ్డ అయ్యగారిపల్లి పంచాయతీ కార్యాలయానికి భవనాన్ని నిర్మించలేదు.

దీంతో పాత భవనం మరింత శిథిలం గా మారి అందులో కార్యనిర్వాహన చేపట్టడానికి అనువుగా లేకుండా పోయింది. పై కప్పు పూర్తిగా పెచ్చులూడి పడిపోతుంది. అలాగే గోడలు కూడా శిథిలంగా మారి వర్షాలకు నిమ్ము వచ్చి ఎప్పుడు కూలి పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో పంచాయతీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ప్రాణ భయంతో హడలిపోతున్నారు.

కార్యాలయానికి సంబంధించిన రికార్డులను కూడా అందులో భద్రపరిచే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. దీనితో కార్యాలయం లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం అయ్యగారి పల్లి పంచాయతీ కార్యాలయం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కొత్తగా గ్రామాన్ని పంచాయతీగా ప్రకటించడంతో గ్రామస్తులు ఎంతో సంతోషపడగా,

కొత్త కార్యాలయం నిర్మాణం కోసం పట్టించుకోకపోవడం, కనీసం పాత భవనానికి మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో అయ్యగారి పల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అయ్యగారి పల్లి గ్రామానికి కొత్త పంచాయతీ భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి కొత్త భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు. 

కార్యాలయంలో కూర్చునే పరిస్థితి లేదు..

పంచాయతీ కార్యాలయానికి కేటాయించిన పాఠశాల భవనం పూర్తిగా శిథిలంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పైకప్పు దాదాపు ఒక దశ పూర్తిగా రాలిపోయింది. పైన ఇనుము పూర్తిగా తుప్పు పట్టి ఎప్పుడు కుప్పు కూలిపోతుందో తెలియని పరిస్థితి.

దీనితో కార్యాలయంలో కూర్చునే పరిస్థితి లేదు. పొద్దంతా కార్యాలయం బయటే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడలు దెబ్బ తినడంతో పాములు సంచరిస్తున్నాయి. దీనితో ప్రస్తుతం కార్యాల యాన్ని వినియోగించడం మానేశాం. 

బొమ్మెర వాణి, పంచాయతీ  కార్యదర్శి, అయ్యగారిపల్లి