17-09-2025 12:30:25 AM
రెండు నెలలుగా అందని వేతనాలు
ఆస్పత్రి కార్మికుల ఆవేదన ఆందోళనకు సిద్ధమవుతున్న సీపీఐ
బాన్సువాడ, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. కార్మికుల ఆవేదన వెరిసి ఆందోళనకు రంగం సిద్ధమవుతోంది. జీతం ఇవ్వండి సారు.. అంటూ నెత్తి నోరు కొట్టుకున్న రెండు నెలలుగా వేతనం అందకపోవడంతో ఆస్పత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టాల్సి వస్తోంది. చేతిలో చిల్లి గవ్వలేక బస్సులు ఉండే దుస్థితి నెలకొందన్న దిగులు వారిలో కనిపిస్తోంది.
ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు అందించే నిర్వాహకులు రెండు మాసాలుగా ఆ ప్రక్రియకు పూనుకోకపోవడం వల్ల ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఇతరాత్ర విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న సామాన్య ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఆస్పత్రిలో వీరి చేసే పని కీలకం. పరిశుభ్రత తో పాటు మరుగుదొడ్లు మూత్రశాలల క్లీనింగ్, పరిసర ప్రాంతాల చెత్తా చెదారాల తొలగింపు ఇతర చోట్లలో కూడా రోజువారీగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఏరియా ఆసుపత్రిలోనే కాకుండా మండల కేంద్రాల్లో ఉండే ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం రోజువారి కార్మికులకు వీరు విధులు నిర్వహిస్తున్నారు.
పని బారెడు పైకం మూరెడు...
కామారెడ్డి జిల్లాలో జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆసుపత్రిలు, మండల కేంద్ర ఆస్పత్రిలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న మహిళలు, పురుషులకు పని భారం అధికమవుతోందని, వేతనం మాత్రం తక్కువగా ఉందంటూ వాపోతున్నారు. పని బారేడు కావడం.. పైకం మాత్రం మూరడే అందడంతో తమ కుటుంబాలు అర్ధాకరితోటే అలమటిస్తున్నామన్నారు.
పలు సందర్భాల్లో పైకం లేక పస్తులు ఉండే పరిస్థితి కూడా నెలకొంటుందని తమ ధీనస్థితిని కార్మికులు వెల్లబుచ్చుతున్నారు. రోజంతా కాయ కష్టం చేసిన నెలకు వచ్చేసరికి తమకు కేవలం రూ. 12,500 మాత్రమే జీతం కింద అందుతుందని చెప్పారు. అందులోనుండి రూ.1500 లు కార్మికుల భవిష్యత్తు నిధి కింద కట్ చేయడంతో మిగిలిన 11 వేల రూపాయలు మాత్రమే కార్మికులకు జీతభత్యాల కింద చేతికి అందుతుందని వారు వివరించారు.
అట్టి పైకంతోనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇతరాత్రా ఖర్చులకు సరిపెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామని కార్మికుల వారి ఆర్థిక పరిస్థితిని చెప్పుకొస్తున్నారు. చాలీచాలని ఏతనాన్నైనా సకాలంలో సమయానికి అందిస్తే నిత్యవసర సరుకుల కనుకొనుగొల్లతోపాటు ఇతర ఖర్చులను పూర్తిచేసుకుని నువ్వు సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంటుందన్న వాదన కూడా వారిలో వినిపిస్తుంది.
కేవలం బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో 90 మంది కాంట్రాక్ట్ కార్మికులు వివిధ చోట్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్ట్ కింద నిర్వాహకుడి కనుసన్నల్లో వీరంతా పనిచేయాల్సి ఉంటుంది. కొందరు పొద్దంతా పనిచేసిన మరికొందరు రాత్రి వేళల్లో కూడా డ్యూటీలు చేయాల్సి ఉంటుంది.
ఆస్పత్రిలో వైద్యులు, స్టాఫ్ నర్సులతోపాటు ఆస్పత్రి సిబ్బంది కింద కొందరు పనిచేస్తుండగా, మిగతావారు మరుగుదొడ్లు మూత్రశాలలను శుభ్రం చేయడం, పరిసరాలను చెత్తాచెదారాలు లేకుండా పరిశుభ్రతతో ఉంచడం, ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రాంగణమంతా గదులను ఫినాయిల్ తో శుభ్రం చేయడం, పనులను వీరే చెక్కబెడుతుంటారు.
వేతనం ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం...
బాన్సువాడ ఏరియా ఆసుపత్రి తో పాటు జిల్లాలో ఇతర చోట్లలో ఉన్న మండల కేంద్ర ఆస్పత్రిలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా వేతనం అందించకపోవడంపై కారణాలు ఏమిటి అన్న విషయం సందిగ్ధంగా మారింది. సదరు నిర్వాహకుడికి వైద్య విధాన పరిషత్ నుండి బిల్లులు రాకపోవడమే ఎందుకు కారణమా అన్న అనుమానం తలెత్తుతోంది.
మరోవైపు నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందకుండా పోతున్నాయి అన్న వాదన కూడా తెరపైకి వస్తుంది. రెండు నెలల నుండి తమకు జీతాలు రావడం లేదండి.. అంటూ ఆసుపత్రి వైద్యాధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ, ఫలితం లేదని ఆరోపణ విలువెత్తుతుంది. ఈ విషయంలో ఇటీవల కార్మికులు ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా సైతం నిర్వహించారు. తమకు రావలసిన వేతనాన్ని తక్షణమే అందించాలంటూ డిమాండ్ చేస్తూ వినతి పత్రం సైతం అందించారు.
అధికారుల చర్యలేవి...
ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి మాసానికి సకాలంలో వేతనాలు అందించే విధంగా వైద్య విధాన పరిషత్ అధికారులు చర్యలు చేపట్ట లేక పోతున్నారని, ఫలితంగా పారిశుద్ధ్య కార్మికులు అప్పు చేసి పొట్ట పోసుకునే పరిస్థితి నెలకుంటుందని సిపిఐ నాయకుడు దుబాస్ రాములు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికునికి రావలసిన రెండు నెలల జీతభత్యాలను చెల్లించకపోతే విధులు మానుకొని ఆందోళన చేపట్టే అవకాశం లేకపోలేదని సిపిఎం నేత హెచ్చరించారు.