23-05-2025 02:17:26 AM
ఇల్లెందు టౌన్, మే 22 (విజయక్రాంతి): సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావును ఒరిస్సాలో అరెస్ట్ చేసి బూటకపు హత్య చేశారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఆవునూరు మధు, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి నాని రాజులు ఆరోపించారు. గురువారం ఇల్లందులో మోతిలాల్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుటకపు హత్యలు చేసి చం పిన 28 మంది లో ఆదివాసీ ప్రజలు మావోయిస్టు పార్టీ సభ్యులు నాయకులు ఉన్నారన్నారు. నంబాల కేశవరావు 55 రోజులుగా కాల్పుల విరమణ శాంతి చర్చలు చేయాలని శాంతి చర్చల కమిటీ, అనేక పార్టీలు, సంస్థలు, ప్రజలు గొంతు ఎత్తి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంటే కేంద్ర ప్ర భుత్వం వరుసగా దాడులు చేస్తూ ప్రజా నాయకులను చంపడం మానవత్వానికి, శాంతికి తీవ్రమైన విఘాతం అన్నారు.
మావోయిస్టు పార్టీ నుండి ఆరు లేఖలు ఒక ఇంటర్వ్యూ ద్వారా శాంతి చర్చలకు వస్తామని, 2004 నాటి శాంతి చర్చలు కావంటూ నిజాయితీగా శాంతికి కట్టుబడ్డామని, ఆయుధ విసర్జన శాంతి చర్చల ఎజెండాలో చర్చిద్దామని, ప్రభుత్వాలకు పదేపదే ప్రకటించి ’జనజీవన స్రవంతిలో’ కలిసే విషయం సైతం తమ కేంద్ర కమిటీ చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని, దానికి అనుకూలంగా రెండు మూడు నెలలు అయిన కాల్పుల విరమణ ప్రకటించమని కేంద్ర ప్రభుత్వానికి నిజాయితీగా విజ్ఞప్తి చేశారన్నరు.
వారి శాంతి చర్చల ప్రతిపాదనలోని నిజాయితీ సమాజం గమనించిందని కానీ పాలక ప్రభుత్వానికి అర్థమైనప్పటికీ వరుసగా నిర్మూలన దాడులు చేయడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన దన్నారు. శాంతి చర్చలు కావాలి అంటుంటే చంపడమే మార్గం అంటుంన్నారని ప్రజలు ఆదివాసీలు ప్రజాస్వామిక వా దులు మేధావులు అన్ని పార్టీల శ్రేణులు ఆలోచించి ఉద్యమాలకు పూనుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపునిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, పొడుగు నరసింహారావు, ముసలి సతీష్, మోతిలాల్, మాజీ సర్పంచ్ వాంకుడోత్ శ్రీను, తుడుం శ్రీను, మాలు, సంతు తదితరులు పాల్గొన్నారు.