23-05-2025 12:45:53 AM
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం దినోత్సవం జూన్ 2న ఐదు లక్షల మంది నిరుద్యోగయువతకు రాజీవ్ యువవికాస పథకం సాంక్షన్ లెటర్స్(మంజూరు పత్రాలు) అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బ్యాంకర్లు సహకరించాలని రాష్ర్ట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారులను నియమించి పథకా న్ని సమన్వయం చేయాలన్నారు.
రాష్ర్టంలో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చి 2030సంవత్సరం నాటి కి 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ర్టస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్బీసీ) సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విద్యాబుద్ధులు నేర్చిన మానవవనరులు ఖాళీగా ఉంటే సమాజానికి లాభం కంటే, నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు.
ఆ నష్టం జరగకుండా ఉం డాలంటే వారి మేథస్సును ఉత్పత్తి రంగంలో వినియోగించి జీడీపీకి పెద్ద ఎత్తున ఉపయోగం ఉం డేలా రాజీవ్ యువవికాస పథకం తీసుకొచ్చామని వివరించారు. 5లక్షల మంది యువతకు రూ.9వేల కోట్ల సాయం చేసే పథకం దేశ చరిత్రలో ఏ రాష్ర్టంలో తీసుకురాలేదన్నారు. రాజీవ్ యువవికాస పథకానికి రాష్ర్ట ప్రభుత్వం రూ. 6,250 కోట్లు సబ్సిడీ రూపేణా ఇస్తున్నదన్నారు.
విద్యలో నైపుణ్యం కలిగిన యువత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని, ఉద్యోగ అవకాశాలు రాని వారి మేథస్సును కూడా ఈ సమాజానికి ఉపయోగపడేవిధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకం రూపకల్పన జరిగిందన్నా రు. దానిలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి, యావ త్ క్యాబినెట్ ఆలోచన చేసి యువత కోసం ఈ పథకం తీసుకొచ్చామని వివరించారు.
మానవ వనరులపై ప్రత్యేక దృష్టి
రాష్ర్టంలో మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చి ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఇందుకోసం రాష్ర్టంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయడంతో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలం గాణ వైపు దేశం మొత్తం చూస్తున్నదన్నారు.
వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం..
ప్రజాప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని ఇందులోనూ ఉద్యానవన పంటలకు ప్రాముఖ్యాన్ని ఇస్తూ వ్యవసా యశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమా ర్క చెప్పారు. ఆయిల్‌పామ్ పంటలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులో ఉదారంగా వ్యవహరించాలని కోరారు.
12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం
అడవి బిడ్డల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని ఇందిరా సౌర గిరి జల వికా సం పథకం ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ర్టంలోని అటవీప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న ఆరు లక్షల 70 వేల ఎకరాలను సౌర విద్యుత్ ద్వారా సాగులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం రూ. 12,600కోట్లు కేటాయించామన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఏడాది వడ్డీ లేకుండా రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చామని, రానున్న నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ మహానగరంలో మూసీ పునర్జీవం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని వెల్లడించారు.
ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనేక రకాలైన క్లస్టర్లతో పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు చెప్పారు. 2025-26 వార్షి క రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్సీ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధ ర్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మోయ్‌కుమార్, నా బార్డ్ సీజీఎం ఉదయ్‌భాస్కర్, ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్‌కుమార్, ఎస్‌ఎల్బీసీ కన్వీనర్ ప్రకాశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.