23-05-2025 12:48:01 AM
న్యూఢిల్లీ, మే 22: వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన వ్యతిరేక పిటిషన్లపై విచారణను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మూడు రోజుల పాటు వాదనలు విన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం వక్ఫ్ సవ రణ చట్టంపై నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.
ఈ నేపథ్యం లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని నిలిపివేయలేమంటూ కేంద్రం సుప్రీం ధర్మా సనానికి మరోసారి స్పష్టం చేసింది. అంతకుముందు వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావన కలిగినప్పటికీ ఇస్లాంలో మాత్రం భాగం కాదని పేర్కొన్న కేంద్రం వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గురువారం తమ వాదనలు వినిపించారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. వక్ఫ్ అంటే మరణానంతరం జీవితం కోసం దేవుడికి అంకితం చేయడమన్నారు. వక్ఫ్ అనేది దాతృత్వం అని, ఇది భవిష్యత్తు కోసం, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమని అభిప్రాయపడ్డారు. వక్ఫ్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని కపిల్ సిబల్ వాదించారు.
కపిల్ సిబల్ వాదనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. హిందువుల్లో మోక్షం అనే భావన ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు.
మతానికి సంబంధం లేని విధులను మాత్రమే వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తామని, అందువల్ల ఆ బోర్డుల్లో ముస్లిమేతర వ్యక్తులను సభ్యులుగా అనుమతించవచ్చని వాదించారు. అలాగే ప్రభుత్వానికి చెందిన భూములు తమవేనని ఎవరు ప్రకటించుకోలేరని పేర్కొన్నారు.