23-05-2025 02:15:18 AM
జగిత్యాల అర్బన్, మే 22 (విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జగిత్యాల జలమయంగా మారిం ది. పట్టణంలోని టవర్ సర్కిల్, కృష్ణానగర్, మార్కండేయ నగర్, చిలక వాడ, రాం బజార్, యావర్ రోడ్, విద్యానగర్ తో పాటు పలు లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజీలు పొంగి వర్షపు నీటితో పాటు మురికి నీరు కూడా ఇళ్లల్లోకి చేరింది.
నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగుతుండడంతో మార్కెట్లో నిల్వ ఉన్న వరి ధాన్యం వర్షం కారణంగా పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. తడిసి ముద్దయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.