23-05-2025 12:00:00 AM
నల్లగొండ టౌన్, మే 22 : వానాకాలం సీజన్ సమీస్తుండటంతో ఈ సారి కూడా నకిలీ విత్తనాల జోరు కనిపిస్తోంది. దళారులు ముందస్తుగానే నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నారు. జిల్లాలో సాగయ్యే పత్తి సాగులో 30 నుంచి 40 శాతం బీటీ-3 విత్తనాలే వేస్తుండడం గమనార్హం. ఏటా జిల్లాలో సీజన్కు ముందు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం సర్వ సాధారణంగా మారింది.
ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, నకిలీ విత్తనాల అమ్మకం దారులపై క్రిమినల్ కేసులు నమోదువుతున్నా నకిలీ విత్తనాల ప్రవాహాన్ని మాత్రం ప్రభుత్వం నిరోధించడం లేదు. నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలలో రైతులు పత్తి సాగు చేస్తుండగా, 13.60 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం ఉందని వ్యవసాయాధికారులు అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటికే రైతులు వేసవి దుక్కులు, సేంద్రీయ ఎరువుల తరలింపు పనుల్లో బిజీగా మారారు. తొలకరి వర్షాలకే పత్తి విత్తుతారు. మే నెలాఖరు కల్లా తొలకరి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాల దిగుమతి..
నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు అక్రమ వ్యాపారులు పొరుగు రాష్ట్రాల నుంచి విత్తనాలను తెచ్చి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. యేటా ముమ్మర తనిఖీల నిర్వహిస్తూ వ్యవసాయ, పోలీసు టాస్క్ఫోర్స్ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుంటున్నా వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. బ్రాండెడ్ విత్తనాల కంపెనీ కంటే అదే నాణ్యత గల విత్తనాలను తక్కువ రేటుకు ఇస్తామని రైతులను నమ్మించి మోసం చేస్తున్నారు.
యేటా ప్రభుత్వం, అధికారులు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా నకిలీ విత్తన విక్రయదారుల దందాకు చెక్ పడటం లేదు. దీంతో రైతులు నకిలీ విత్తన విక్రయదారుల మాయమాటలకు మోసపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్నారు.
బీటీ3పై రైతుల ఆసక్తి...
ఎక్కువ దిగుబడి, చీడ పీడలు తట్టుకునే గుణం దృష్ట్యా నిషేధిత బీటీ-3 పత్తి వేసేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇవే కాక కలుపు నివారణ లేకుండా దిగుబడులు వచ్చే అవకాశమున్న బీటీ-3 సాగుకే మక్కువ చూపుతున్నారు. ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించినా అమ్మకాలు మాత్రం కొనసాగుతున్నాయి. డిమాండ్కు అనుగుణంగా వ్యాపారులు విక్రయిస్తూ సొమ్మ చేసుకుంటున్నారు.
కొందరు వ్యాపారులు గ్రామాల్లో ప్రతినిధులను నియమించుకొని వారి ద్వారా రైతులకు అందజేస్తున్నారు. ఏజెంట్లకు కొంత కమీషన్ ఇచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. 750 గ్రాముల బీటీ -3 పత్తి విత్తన ప్యాకెట్ ధర డిమాండ్కు రూ.800 నుంచి రూ.1,200 వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే కొంత మంది రైతుల వద్దకు బీటీ-3 విత్తనాలు చేరినట్లు తెలుస్తోంది.
కరువైన అధికారుల ముందుచూపు..
నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకో వడం లేదు. తీరా మార్కెట్లోకి వచ్చి రైతులకు అమ్మిన తరువాత దాడులు చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులకు ముందు చూపు కరువైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవసాయ శాఖ తీరుంది. వానకాలం విత్తనాలు అమ్ముతారని తెలిసిందే. మరి ఇప్పటి నుంచే దాడులు నిర్వహిస్తే నకిలీ విత్తన గోదాములను కనుక్కోవచ్చు.
అలాగే ప్యాకింగ్, విత్తన సేకరణ వంటి వాటిపైనా దృష్టిసారిస్తే నకిలీ విత్తనాలు మార్కెట్లోకి విడుదలకు, గ్రామాల్లో అమ్మకముందే అరికట్టే ఆస్కారముంది. ఇదే అదునుగా అక్రమ వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
రహస్యంగా దిగుమతి...
వ్యాపారులు నిషేధిత బీటీ పత్తి విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమంతి చేసుకుంటున్నారు. ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి బీటీ-3 విత్తనాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. కర్ణాటక, ఏపీలోని కర్నూల్, గుంటూరు జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గతం లో పట్టుబడిన నకిలీ విత్తనాలు కూడా కర్ణాటక, కర్నూల్, ఏపీ, మహారాష్ట్ర, నుంచి తరలించినవేనని అధికారులు నిర్ధారించారు. నిల్వ చేసుకున్న పత్తి విత్తనాలను రహస్యంగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లలో గ్రామాలకు తరలిస్తూ రైతులకు అంటగడుతున్నారు. అధికారులు మాత్రం ఆప్రమత్తం కావడం లేదు.
నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా, మండల స్థాయిల్లో అన్ని ఫెర్టిలైజర్ దుకాణాలు, గోదాములను తనిఖీ చేస్తున్నాం. నకిలీ విత్తనాల కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వ్యాపారులు నకిలీ, నిషేధిత బీటీ విత్తనాలను అమ్మితే చర్యలు తప్పువు. అలాగే రైతులు కూడా విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానం ఉంటే అధికారుల సూచనల మేరకు విత్తన కొనుగోళ్లు చేసుకోవాలి.
లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి. ప్రతీ కొనుగోలుకు బిల్లులో విత్తనం బ్యా నెంబర్, కంపెనీ పేరు, తయారీ/ఎక్స్పైరీ తేదీలు, డీలర్ సంతకం, రైతు సంతకం కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. లూస్ సీడ్ కొనొద్దు. సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల విత్తనాలనూ తీసుకోవద్దు. విత్తనాలు కొన్నప్పుడు తీసుకున్న బిల్లును పంట కాలం పూర్తయ్యేంత వరకు భద్రపర్చుకోవాలి.
శ్రావణ్ కుమార్
జిల్లా వ్యవసాయాధికారి