13-09-2025 06:43:34 PM
ఘట్ కేసర్ లో ఏచూరికి సీపీఎం ఘన నివాళులు..
ఘట్ కేసర్ (విజయక్రాంతి): మనువాదాన్ని ప్రతిఘటించిన మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి అని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు చింతల యాదయ్య, మండల కార్యదర్శి నార్కట్ పల్లి సబిత అన్నారు. శనివారం ఘట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి విప్లవ భావాలవైపు ఆకర్షితుడైన సీతారాం ఏచూరి తుది శ్వాస వరకు నిబద్ధత కలిగిన మార్క్సిస్టుగా దేశంలో కార్మిక వర్గ పక్షపాతిగా నిలిచాడని చెప్పారు.
మతోన్మాదులను ప్రతిఘటించి అభ్యుదయ శక్తులను ఒక్కదాటి మీదికి తీసుకొచ్చాడని అన్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని రోడ్డుపై నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు. సిపిఎం అంతర్జాతీయ విభాగానికి నాయకుడుగా అనేక దేశాలలో జరుగుతున్న వర్గ పోరాటాలను కమ్యూనిస్టు పార్టీ విశిష్టతను చాటి చెప్పాడన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాపయ్య, వి. శీను, కె. బిక్షపతి, చిన్న నాయక్, దాసు పి. చంద్రయ్య, కె. నాగరాజు, జి. బిక్షపతి, పి. శంకర్, పి. యాకయ్య, కొండల్, బాలరాజు, మహేందర్, స్వాతి, లీల, తదితరులు పాల్గొన్నారు.