06-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ మహబూబాబాద్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె. అనిల్ కుమార్, సంబంధిత మండలాల ప్రత్యేక అధికారులతో కలిసి ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం అన్ని చర్యలు తీసుకొని ముందుకు సాగడం జరుగుతుందని, ప్రతి ఒక్కరి విధులను వారికి తెలిసే విధంగా పలు శిక్షణ తరగతులు మాస్టర్ ట్రైనర్స్ చే నిర్వహించడం జరిగిందని, ప్రతిదీ పారదర్శకంగా నిర్వహించుటకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు.
జిల్లా సీనియర్ అధికారులు మండలాలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న వారి వారి మండలాలలో ఎన్నికల విధులు నిర్వహించే రూట్ మ్యాప్ ప్రకారం అన్ని సరిచూసుకోవాలని, పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు టాయిలెట్స్, త్రాగునీరు, విద్యుత్, కాంపౌండ్ వాల్, ర్యాంప్, తదితర సౌకర్యాలను ముందే సరి చూసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రవాణా పోస్టల్ బ్యాలెట్, తదితర ఎన్నికలకు సంబంధించిన ప్రతి పనిని ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం పక్కాగా నిర్వహించాలని తెలిపారు.
పోలీస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసిల్దార్లు, సంబంధిత శాఖల వారందరూ ప్రోటోకాల్ ప్రకారం సమన్వయంతో కలిసి ఎన్నికల విజయవంతనికి కృషి చేయాలన్నారు. వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూమ్స్, మైక్రో అబ్జర్వర్ ట్రైనింగ్స్, తదితర సిబ్బందికి మిగిలిన శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.