18-05-2025 10:36:32 PM
173 కోట్ల రూపాయల చెల్లింపు
రైతులకు అండగా జిల్లా యంత్రాంగం
మహబూబాబాద్,(విజయక్రాంతి): యాసంగి సీజన్ లో మహబూబాబాద్ జిల్లాలో రైతులు పండించిన ధాన్యంలో ఇప్పటివరకు 1,27,224 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు డీఎస్ఓ ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆదివారం జిల్లాలోని తొర్రూరు తహసిల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం ధాన్యం కొనుగోలు వివరాలను తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ధాన్యం కొనుగోలు శీఘ్రగతిన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు ఆయా మండలాలకు చెందిన తహసిల్దార్లు, ఇతర శాఖల అధికారులు, ధాన్యం సేకరణను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నియమించిన ప్రత్యేక అధికారులతో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కే.వీర బ్రహ్మచారి ఆధ్వర్యంలో మానిటరింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 75 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, మరో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 56 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి సామర్థ్యం మిల్లుల్లో ఉందని, ఇందుకు అవసరమైన గన్ని సంచులు, లారీలు, ఇతర ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు. కొన్నిచోట్ల నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తూ, అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఆయా సంఘటనలపై విచారణ చేసి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇప్పటికే 25,889 మంది రైతులకు చెందిన 1,07,000 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని, అలాగే 26,475 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి 173 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని, వదంతులను నమ్మవద్దని, రైతులు పండించిన ధాన్యంలో చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. తొర్రూరు మండలం అవుతాపురం, తొర్రూరు, అమ్మాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలను సమకూరుస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
రేపటి ప్రజావాణి రద్దు
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అధికారులు నిమగ్నమైనందున సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండే అవకాశం లేనందున, ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం కలెక్టరేట్ కు ఫిర్యాదులు, వినతిపత్రాలు ఇవ్వడానికి రావద్దని కోరారు.