calender_icon.png 15 January, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత కార్మికుల రుణమాఫీకి 16.27 కోట్లు

15-01-2026 03:28:28 AM

  1. గతంలో 33 కోట్ల నిధుల విడుదల 
  2. ఇప్పటి వరకు రూ.960 కోట్లు ఖర్చు చేశాం
  3. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి) : చేనేత కార్మికులకు లక్ష వరకు రుణమాఫీ కోసం 16.27 కోట్లకు అదనంగా పరిపాలన అనుమతులు జారీ అయినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో రూ. 33 కోట్ల నిధులు చేనేత కార్మికులు రుణమాఫీ కోసం విడుదల చేసినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ అవుతాయన్నారు. 6,784 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి చేనేత కార్మికుల సంక్షేమం కోసం దాదాపు రూ. 960 కోట్లు ఖర్చు చేశామన్నారు.

చేనేత కార్మికులకు ఎల్లప్పుడు పని కల్పించాలనే ఉద్ధేశ్యంతో అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో నుంచే వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే రూ. 896 కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇందిరా మహిళాశక్తి చీరల పథకం ద్వారా 30 వేల మర మగ్గాలకు నిరంతరం పని కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

రూ. 150 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం కార్మికులకు చెల్లించకుండా వదిలేసిన రూ. 290 కోట్లను నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత వస్త్ర ప్రదర్శన, వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ ఇస్తామన్నారు. ఈ సంవత్సరంలో జిల్లా సహకార బ్యాంకులు ద్వారా 78 సహకార సంఘాలకు రూ.19 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ మంజూరు చేశామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు.