15-01-2026 03:03:04 AM
జర్నలిస్టుల అరెస్టును ఖండించిన కేటీఆర్
హైదరబాద్, జనవరి 14 (విజయక్రాంతి): అసలు లీకర్ ఎవరు? వారిని వది లేసి.. సంక్రాంతి పండుగవేళ పోలీసులు ముగ్గురు జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని గుర్తుచేస్తోందని విమర్శించారు. డీజీపీ జర్నలిస్టులను నేరస్తుల్లా ట్రీట్ చేయ డం దురదృష్టకరమని బుధవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ముందుగా వారికి నోటీసులు జారీచేసి విచారణకు పిలువాల్సిందని, రాత్రిపూట జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేయడం సరైంది కాదన్నారు.
వారిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు నమోదు కాలేదని, అలాంటప్పుడు తెలంగాణ పోలీసులు జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఎందుకు అర్ధ రాత్రి అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేశారని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులను వెంటనే విడుదల చేసి వారి విషయంలో చట్టపరంగా నడుచుకోవాలని తాను డీజీపీని కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి, ఆ పార్టీ నీచ నాయకత్వానికి అనుగుణం గా మురికి రాజకీయాలు చేయవద్దని ఆయ న సూచించారు. ‘అసలు ఈ విషయాన్ని లీక్ చేసింది ఎవరు? మిస్టర్ 30 పర్సెంట్ సపోర్టు లేకుండా ప్రభుత్వ అనుకూల టీవీ ఛానెల్ ఈ అంశాన్ని ప్రసారం చేసిందని మీరు భావిస్తున్నారా?’ అని ప్రశ్నించారు.