15-01-2026 03:34:13 AM
జీవవైవిధ్యం కాపాడే బాధ్యత ప్రజలదే
జహీరాబాద్‌లో పాత పంటల జాతర ప్రారంభోత్సవంలో డీఎస్పీ సైదా నాయక్
జహీరాబాద్, జనవరి 14: పాత పంటలతో పండించిన ఆహారం మనిషి జీవిత ప్రమాణాన్నిపెంచుతుందని సం గారెడ్డి జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అన్నారు. బుధవారం జహీరాబాద్ మండలం జమలై తండాలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) 26వ పాత పంట ల జాతరను సాంప్రదాయబద్ధంగా విత్తనాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పాత పంటల విధానంతో పండించిన పంటల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వివరించారు.
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వైస్ చైర్మన్ రుక్మిణీరావు మాట్లాడుతూ.. మహిళలు పండించే పంటలు దేశమంతా తింటున్నారని. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో వెంచర్లు, ఫ్యాక్టరీలు వెలిసి, పంటల విస్తీర్ణం పెరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలలో అంగన్వాడీలు లేని సమ యంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అంగన్వాడీలను ఏర్పాటు చేసి బీద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించిందని గుర్తుచేశారు. గతంలో ఉపాధి హామీ పనులు లేని సమయంలో తమ సంస్థ పనులు కల్పించి వారి పొలాలను బాగు చేసుకునేందుకు సంస్థ కృషి చేసిందని వివరించారు.
డిడిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య మాట్లాడుతూ.. మన ఊరు, మన పంటలు, మన ఆరోగ్యం, మన నీరు, మన పొలం అనే దృష్టితో రైతులు వ్యవసాయం చేయాలని, దీని ద్వారా ప్రజల ఆరోగ్యంతోపాటు వ్యవసాయం చేసే కుటుంబీకుల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారన్నారు. కార్యక్రమంలో జమలై తండా సర్పంచ్ మోహన్, సీఐ శివలింగం, ఎస్సులు కాశీనాథ్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.