15-01-2026 03:22:58 AM
హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రతి వారం బిల్లులు చెల్లింపుల్లో భాగంగా ఈ వారానికి 13,861 మంది లబ్దిదారులకు రూ.152.40 కోట్లు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఇంటి నిర్మాణపు పనుల పురోగతిని బట్టి ప్రతి వారం బిల్లులను పూర్తి పారదర్శకంగా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటీ వరకు 2.50 లక్షల ఇండ్ల పనులు ప్రారంభమ య్యాయని, వీటిలో సుమారు 1.22 లక్షల ఇండ్లు గోడలు, శ్లాబ్‌లు అయిపోయి త్వరలోనే పూర్తి కానున్నాయని ఆయన పేర్కొన్నారు.
మార్చి నెలాఖరు కల్లా ఇవి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటూ, మిగిలిన ఇండ్ల పనులు మరో మూడు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేస్తున్నామని ఎండీ గౌతమ్ చెప్పారు. ఇదిలా ఉంటే ఇందిరమ్మ పథకంలో ఇంతవరకు మొత్తం రూ.4000 కోట్లకు పైగా నిధులను లబ్ధిదారులకు విడుదల చేశామని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల సంబంధించి ఎవరికీ ఎటువంటి లంచాలు ఇవ్వవద్దని, ఎవరైనా డిమాండ్ చేసినా, ఇతర సమస్యలున్నా కాల్ సెంటర్ 1800 599 5991కు ఫిర్యాదు చేయాలన్నారు.