21-12-2025 12:29:28 AM
హైదరాబాద్, డిసెంబర్ ౨౦ (విజయక్రాంతి): బాతిక్.. ఇది ప్రాచీన మైనపు అద్దకాలకు సంబంధించిన చిత్రకళ. దీని మూలాలు ఈజిప్ట్, చైనా, ఇండోనేషియాలో ఉన్నాయి. క్రమంగా ఈ సంస్కృతి భారత్‌కు వచ్చింది. ‘బాతిక్’ అనే పదం ఇండోనేషియా నుంచి వచ్చింది. అక్కడి జావా భాషలో ‘అంబా’ అంటే అద్దకం, ‘తిక్’ అంటే చుక్క అని అర్థం. అంటే.. వస్త్రంపై మైనంతో చుక్కలు పెడుతూ వేసే చిత్రకళ అని అర్థం.
1817 లో థామస్ స్టాంఫోర్డ్ రాఫిల్స్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ జావా’ పుస్తకం వల్ల ఈ కళకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. భారతదేశంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’లో ఈ కళ పునరుజ్జీవం పొందింది. ఠాగూర్ 1920 ప్రాంతంలో ఈ కళను దేశవ్యాపితం చేసేందుకు ఎంతో కృషి చేశారు. అంతటి ఘన చరితగల చిత్రకళ తెలంగాణలోని సిద్ధిపేటలో ఇప్పటికీ విలసిల్లుతున్నది.
ఇక్కడి కళాకారులు ఈ శైలిలో తెలంగాణ ప్రాంతపు గ్రామీణ జీవితాలను, శ్రమైక జీవన సౌందర్యాన్ని అద్భుతంగా వస్త్రాలపై ఆవిష్కరిస్తున్నారు. ఈ కళకు జీవో గ్రాఫికల్ (జీఐ ట్యాగ్) గుర్తింపు తీసుకువచ్చేందుకు తాజాగా ‘సిద్ధిపేట బాతిక్ పెయింటింగ్స్ సొసైటీ’ దరఖాస్తు చేసిం ది. వారికి రాష్ట్ర పరిశ్రమల శాఖ సహా య, సహకారాలు అందిస్తున్నది. జీఐ ట్యాగ్ గుర్తింపు వస్తే ఈ కళ అంతర్జాతీయ ఖ్యాతి గడించనున్నది. కళాకారుల ఆర్థికాభివృద్ధికీ జీఐ ట్యాగ్ దోహదం చేస్తుంది.
గ్రామీణ జీవితంపై చిత్తరువులు
సిద్ధిపేటకు చెందిన బాతిక్ కళాకారులు వ్యవసాయం, కుల వృత్తుల శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే విధం గా ఈ చిత్తరువులు రూపొందించి అబ్బురపరుస్తున్నారు. చిత్రాలకు కళాకారు లు వినియోగించే మైనపు రంగులు ఎంతో గాఢంగా ఉంటాయి.
ప్రకృతి సిద్ధమైన రంగులు వినియోగించడం వల్ల చిత్తరువు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వస్త్రంపై మైనం ఆరిన తర్వాత కళాకారులు వాటిని నలిపేస్తారు. దీంతో వస్త్రంపై సన్నని మైనపు పగుళ్లు ఏర్పడతాయి. ఇదే బాతిక్ చిత్రకళ ప్రత్యేకత. ఆ పగుళ్లు చిత్తరువుకు ఒక రకమైన పురాతనమైన, కళాత్మకమైన రూపం తీసుకువస్తాయి.
ఇతర చిత్రకళల కంటే భిన్నం
ఇతర చిత్రకళలతో పోలిస్తే బాతిక్ చిత్రకళ భిన్నమైనది. విలక్షణమైనది. సాధారణంగా చిత్రకారులు కుంచెలతో చిత్తరువులు గీస్తారు. కానీ బాతిక్ కళాకారులు వేడి వేడి మైనాన్ని వస్త్రంపై అద్ది చిత్రాన్ని రూపొందిస్తారు. ఈ ప్రక్రియలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం వస్త్రం చిత్రం పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కళాకారులు సంపూర్ణమైన ఏకాగ్రతతో చిత్రాన్ని గీస్తా రు. అందుకు కళాకారులు ప్రత్యేకమైన కలాలను వినియోగిస్తారు. చిత్రం పూర్తయిన తర్వాత వస్త్రాన్ని ఆరబెట్టి, ఎంపిక చేసిన రంగుల్లో ముంచుతారు. ఓపిగ్గా ఒక్కో రంగు అద్దుతారు.
బాలయ్య కృషి
సిద్ధిపేటకు చెందిన యశాల బాలయ్య బాతిక్ చిత్రకళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే తెలంగాణ ప్రాంతంలో బాతిక్ చిత్రకళ అనగానే బాలయ్య పేరే గుర్తువస్తుంది. బాలయ్య 1939 నుంచి 2020 వరకు బాతిక్ కళను వృత్తిగా కొనసాగించారు. ఈ అరుదైన చిత్రకళలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. సరికొత్త ప్రయోగాలు చేశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ కళను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని సిద్ధిపేటలోని భరత్‌నగర్‌కు చెందిన అనేక మంది ఈ కళను వృత్తిగా ఎంచుకున్నారు.
బాతిక్ చిత్రకళను సజీవంగా ఉంచుతూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కళకు జీవో గ్రాఫికల్ (జీఐ ట్యాగ్) గుర్తింపు తీసుకువచ్చేందుకు ‘సిద్ధిపేట బాతిక్ పెయింటింగ్స్ సొసైటీ’ తాజాగా దరఖాస్తు చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ వారికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. ఆ గుర్తింపు వస్తే సిద్ధిపేట కళాకారులకు మున్ముందు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు వస్తాయి.