09-05-2025 02:10:57 AM
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యూనియన్ బ్యాంకు సిబ్బంది
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామకృష్ణాపురం బ్రాంచి సిబ్బంది.. గుండెపోటుకు గురైన ఓ కస్టమర్ ప్రాణాలు కాపాడారు. బ్యాంకు వద్ద ఉన్న ఏటీవలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ కస్టమర్ గుండెపోటుకు గురై అక్కడే పడిపోయాడు.
బ్యాంకు ఉద్యోగులు బయటకు వచ్చి చూశారు. వారిలో వంగర శ్రీధర్‌బాబు కస్టమర్‌కు సీపీఆర్ చేయడంతో అతడు స్పృహలోకి వచ్చాడు. బ్యాంకు సిబ్బంది అతడిని 30 నిమిషాల పాటు బ్రాంచీలోనే కూర్చోబెట్టారు. అతను పూర్తిగా కోలుకున్నాక వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇచ్చి, అక్కడి నుంచి పంపించారు.
ఈ ఘటన మొత్తం ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి ఏరియా ఏరియా హెడ్ సత్యం పలుగుల సింహయ్య, డిప్యూటీ ఏరియా హెడ్ ఎం మహేశ్వరస్వామి, నంద్ కిషోర్‌కుమార్, చీఫ్ మేనేజర్ నవనీత్‌కుమార్ శ్రీరామకృష్ణాపురం బ్రాంచి సిబ్బందిని సత్కరించారు.