07-08-2025 01:41:39 AM
కల్వకుర్తి, ఆగస్టు 6: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండలో పందు ల దొంగలు బీభత్సం సృష్టించారు. పందులను దొంగిలిస్తున్న క్రమంలో అడ్డుకున్న వారిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు.
ఈ ఘటన బుధవారం రాత్రి వెల్దండ మండల కేంద్రంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. కల్వకుర్తిలోని విద్యాన గర్ ప్రాంతానికి చెందిన బెల్లంకొండ రాములు (40), కొండ్రేటి వెంకటయ్య, కొండ్రేటి నిరంజన్, మాలపాటి రామచంద్రి, మాలపాటి మహేశ్‌లకు చెందిన పందులను పట్టణానికి దూరంగా ఒక షెడ్డు ఏర్పాటు చేసుకొని పెంచుతున్నారు. వెల్దండకు చెందిన కొందరు వ్యక్తులు తరచూ షెడ్‌లోని పందులు దొంగిలిస్తున్నారు.
దీంతో మంగళవారం సైతం పందులను దొంగిలించినట్టు గుర్తించిన పందుల పెంపకందారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం ఉన్న వ్యక్తులు వెల్దండ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి వెల్దండ పీఎస్‌లోనూ ఫిర్యాదు చేసి,
అక్కడి సిబ్బంది సహాయంతో వారిని పట్టుకొనే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ప్రతిఘటించిన పందుల దొంగలు పట్టుకునేందుకు వెళ్లిన వారిపై వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో బెల్లంకొండ రాములు అక్కడికక్కడే మృతిచెందగా మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.