07-08-2025 01:42:16 AM
వరద కాలువ ఆక్రమణలపై పోలీసు కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో ఆగస్టు 6 (విజయక్రాంతి): నాలాలు, వరద కాలువల కబ్జాలను హైడ్రా సీరియస్‌గా తీసుకుంది. భరత్‌నగర్, -ఖైతలాపూర్ మార్గంలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ సాగే వరద కాలువను కబ్జా చేసిన వాసవీ నిర్మాణ సంస్థపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. 17 మీటర్ల వెడల్పుతో పాటు.. ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ విడిచి పెట్టకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని ముల్లకత్వ చెరువు కాముని చెరువు -మైసమ్మ చెరువులను కలుపుతూ వెళ్లే వరద కాలువలో మట్టి పోసినట్టు నిర్ధారణ అయ్యింది. నిర్మాణ సంస్థపై కేసు పెట్టాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు. నాలా ఆక్రమణలను వెంటనే తొలగించాలని సూచించారు. ఈ మేరకు హైడ్రా అధికారులు జేసీబీలతో, టిప్పర్లతో మట్టిని తొలగించారు. ఆ మట్టిని వాసవీ నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలోనే పడేశారు. వరద కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ వాసవీ నిర్మాణ సంస్థపై కూకట్‌పల్లి పీఎస్‌లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
కంచెతో కబ్జాలకు చెక్ పెడదాం..
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని పుప్పాలగూడలో 200ల ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇక్కడ దేవాలయాలకు, దర్గాకు 10 ఎకరాల వరకు భూమి ఇచ్చినట్టు చెబుతున్నారని.. దీన్ని కూడా రెవెన్యూ వాళ్లతో పరిశీలిస్తామన్నారు. ఆమేరకు హద్దులు నిర్ధారించి కంచెలు వేస్తామన్నారు. 452/1, 454/1 సర్వే నంబర్లలో ఉన్న కొండలను పరిరక్షించాలని కోరుతూ సొసైటీ టూ సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ మతాలకు సంబంధించి కేటాయించిన భూముల వివరాలను తెలుసుకున్నారు. త్వరలోనే వారందరితో సమావేశం ఏర్పాటు చేసి.. వారికి కేటాయించిన భూముల మేరకు ఫెన్సింగ్ వేస్తామన్నారు.