calender_icon.png 21 December, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ సర్పంచులు అభివృద్ధిపై దృష్టి సారించాలి!

20-12-2025 08:15:55 PM

గెలిపించిన ప్రజలకు సేవ చేయాలి!

ఎస్సీ సర్పంచులను ఘనంగా సన్మానించిన దళిత సంఘాల నాయకులు

సుల్తానాబాద్, డిసెంబర్ 20 (విజయ క్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఇటీవల గెలుపొందిన ఎస్సీ సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, తమపై నమ్మకంతో ఓట్లు వేసిన అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం సేవ చేయాలని మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య, అంబేద్కర్ సంఘాల సీనియర్ నేతలు న్యాతరి ప్రభాకర్, న్యాతరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సంకనపల్లి లక్ష్మయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ రుద్రారపు కనకయ్య, రిటైర్డ్ హెచ్ఎం ఆర్నకొండ నరసయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చిలక రాజేశంలు సూచించారు.

శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలుపొందిన ఓగుల పూజ రాజేందర్ నివాసంలో శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. నీరుకుల్ల గ్రామ సర్పంచిగా ఘనవిజయం సాధించిన సాఫ్ట్వేర్ కాంపల్లి సతీష్ ను నీరుకుల్ల గ్రామంలోని  ఉన్నత పాఠశాలలో శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. తొగర్రాయి గ్రామ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలుపొందిన చిలుక స్రవంతి సతీష్ ల నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో తమపై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి పలాలు అందజేయాలని సూచించారు. రిజర్వుడు స్థానాల్లో ఎస్సీలకే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొంది ఆదర్శంగా నిలవాలని, జిల్లాలోనే ఎస్సీ రిజర్వుడు గ్రామపంచాయతీలను ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి పనులు చేయాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ఫలాలతో నేడు ఎస్సీలు సర్పంచ్ నుండి మొదలుకొని ఎంపీపీ జిల్లా పరిషత్ మెంబర్ ఎమ్మెల్యే ఎంపీ గా ఎన్నికవుతున్నారని, ప్రజాస్వామ్య దేశంలో ఎస్సీలు పాలకులు కావాలన్నా అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని వారు కోరారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు కనీస అవసరాలు కల్పించడంలో గ్రామానికి ప్రథమ పౌరులైన సర్పంచులు తమ విధులను పారదర్శకంగా నెరవేర్చాలని తెలిపారు. సర్పంచ్ అన్న పదానికి వన్నె తీసుకురావడానికి ఐదు సంవత్సరాల కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల కు సేవ చేయాలని, తద్వారా రాజకీయ రంగంలో ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తోందని స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోటగిరి పాపయ్య, న్యాతరి ప్రభాకర్, న్యాతరి శ్రీనివాస్, సంకెన పల్లి లక్ష్మయ్య, రుద్రారపు కనకయ్య, ఆర్నకొండ నర్సయ్య, చిలుక రాజేశం తదితరులు సూచించారు.