calender_icon.png 21 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్నాథపురంలో వృక్షశిలాజాలు

21-12-2025 12:48:15 AM

  1. అటవీ ప్రాంతంలో నీటి వాగు వెంట విస్తరించిన కొయ్య శిలాజాలు 
  2. వీటి వయస్సు పన్నెండున్నర కోట్ల నుంచి 6కోట్ల ఏళ్లని అంచనా
  3. పరిశోధనలు జరిపితే జంతుశిలాజాలు సైతం లభ్యం
  4. సత్తుపల్లిని శిలాజ వనరులున్న రక్షితప్రాంతంగా గుర్తించాంటున్న పరిశోధకులు
  5. కొయ్యశిలాజాలు తెలంగాణ కొత్త చరిత్రకు ఆధారాలంటూ విశ్లేషణ

వృక్షశిలాజాలది డైనోసార్లంత పురాతన చరిత్ర. రెండవసారి తెలంగాణకు డైనోసార్ల రాక  పన్నెండున్నర కోట్ల నుంచి 6కోట్ల సం.ల క్రితం జరిగిందని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. కోనిఫర్ రకం చెట్లు డైనోసార్లకు ఆహారం. డైనోసార్లతో పాటే నశించిన ఈ చెట్లు శిలాజాలుగా మారివుంటాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర పెనుబల్లి పేరు చూసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో తప్పక డైనోసార్ల ఆనవాళ్లు దొరికే అవకాశాలున్నాయి. అదీకాక ఇటువైపు బొగ్గుగనులుండడం పెద్ద మూలం. నేలబొగ్గు కూడా ఒక రకంగా శిలాజమే.

జగన్నాథపురంలో లభ్యమైన కొయ్యశిలాజాలు ఈ ప్రాంతం ఒకప్పడు డైనోసార్లు తిరుగాడిన నేల అని చెప్పడానికి సాక్ష్యాలు. ఈ వృక్షశిలాజాల స్వరూప స్వభావాలు, గతంలో ఇలాంటి శిలాజాల మీద పరిశోధనలు జరిపిన పరిశోధకుల అభిప్రాయాలను పరిశీలిస్తే వీటి వయస్సు  పన్నెండున్నర కోట్ల నుంచి 6కోట్ల సంవత్సరాలు ఉండవచ్చు. మా పరిశోధకుడు కట్టా శ్రీనివాస్ తన పరిశోధనలను మౌలిక పరిశీలన మీద ఆధారపడి చేస్తాడని.. ఈ పురావస్తు ఆధారాలు తెలంగాణ చరిత్రకు కొత్త పేజీలు.

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి దగ్గరలో జగన్నాథపురం అటవీ ప్రాంతంలో నీటి వాగు వెంబడి కొంత భూమిలో కూరుకుని, కొంత బయటికి కనిపిస్తూ వృక్ష శిలాజాలు అనేకం విస్తరించి ఉన్నాయి. అనుమానానికి ఆస్కారం లేనంత స్పష్టంగా మొక్క వార్షిక వలయాలు బాహ్య దారు వు సైతం శిలాజంగా మారి వీటిలో స్పష్టంగా కనిపిస్తోంది. హఠాత్తుగా చూస్తే ఎండిన మొద్దు కావచ్చు అనిపించేంతగా మాను పోలికలతో ఈ శిలాజాలు కనిపిస్తున్నాయి.

గొండ్వా నా కాలం నుంచి జీవపు మనుగడకు అనుకూలమైన వాతావరణం ఉన్న తెలంగాణ నేలలపై మరిన్ని శిలాజ నమూనాలు కనిపించే అవకాశం వుంది. సత్తుపల్లి పరిసరాల్లో మరికొం త లోతైన పరిశోధనలు జరిగితే ఇప్పటిలా వృక్షశిలాజాలతో పాటు మరికొన్ని జంతు శిలాజాలు సైతం దొరికే అవకాశం ఉంది. 

వృక్ష శిలాజము అంటే ఏమిటి? 

శిలలో పుట్టేది కాబట్టే ఆ రూపాలను శిలాజం అంటు న్నాం. ఆంగ్లంలో ఫాజిల్  అనేది లాటిన్ ఫాడెరి నుంచి పుట్టింది. అప్పటి జీవులు అంటే జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు భూమిలో కూరుకుపోయి వాటిపై ఇసుక మన్ను లాంటిది పేరు కుని కాలక్రమంలో దాని కణంలో ఇదే ఇసుకలాంటిది చేరుకుంటూ వేడికి మరింత ఘనీ భవించి మనం మూసలు పోసిన పద్ధతిలో అచ్చంగా ఆ జీవి ఆకారంలో ఒక రాతిలా ఒకప్పటి చెట్లు లక్షలాది సంవత్సరాల క్రితం నెలలో కూరుకుపోయి ఒక క్రమంలో చాలా నెమ్మదిగా రాయి లాగా మారుతూ వస్తా యి.

ఇలా మొక్కలే కాకుండా జంతువులు కూడా శిలాజాలుగా మారుతాయి.. వాటిని జంతు శిలాజాలు అంటారు. నిజానికి పెనుబల్లి అంటే పెద్దబల్లి అని కదా ఒకప్పుడు రాక్షస బల్లి శిలాజం ఏదో ఈ ప్రాంతంలో కనిపించడం వల్లనే ఆ పేరు ఏర్పడివుండవచ్చని కట్టా శ్రీనివాస్ పరికల్పన (హైపోథీసిస్) చేస్తున్నారు. 

జీవం ఉనికికి అత్యంత పురాతన ఆనవాళ్లు ఈ శిలాజాలు

భూమిపై ఎన్నో వేల ఏళ్ల నుంచి జీవరాశి ఉనికి ఉంటున్నప్పటికీ దానికి ఆధారాలు ఎముంటాయి? ఎలా దొరుకుతాయి.? అని చూస్తే ఈ శిలాజరూపాలు ఒక చెక్కుచెదరని ఆధారం అవుతుంది. అప్పటి కాలంలోని జీవరాశి రూపం నిర్మాణాలను రాతిగా మార్చి ఇప్పటి మనకోసం దాచి ఉంచిన చారిత్రక నిధిలాంటివి ఈ శిలాజాలు.

వీటిని పరిశీలించడం ద్వారా అప్పటి మొక్కల జంతువుల శారీరక నిర్మాణం ఎలావుందో అర్థం చేసుకోవడంతో పాటు ఇప్పటికి ఆయా జీవుల్లో ఎటువంటి మార్పులు సంభవించా యో అర్థం చేసుకునేందుకు వీలవు తుంది. మొత్తంగా అంతరించిపోయిన రాక్షసబల్లి వంటి జీవులను అర్థం చేసుకోవాల న్నా, అవి అంతరించిపోయిన కారణాన్ని అంచనా వేయాలన్నా ఇప్పటికీ మనకు మిగిలిన ఆధారం వాటి శిలాజ రూపాలే. 

కొండపల్లిలో 20 కోట్ల ఏళ్ల వృక్షశిలాజాలు

పూర్వ ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని వేమనపల్లి ప్రాం తంలో దొరికిన అటువంటి శిలాజాన్నే హైదరాబాద్ లోని బిర్లాసైన్సు మ్యూజియంలో భద్రపరిచారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని బెజ్జూరు రేంజ్ సలుగుపల్లి సెక్షన్‌లో గల కొండపల్లి అటవీ ప్రాంతం లో గొప్ప శిలాజ ఉద్యానవనం నిర్మించేంత విస్తీర్ణంలో అనేక వుడ్ ఫాజిల్స్ పరచుకుని వున్నాయి. 75 పైగా ఎకరాల పరిధిలో విస్తరించిన 20 కోట్ల ఏళ్ల క్రితం వృక్ష శిలాజాలు ఉన్నాయి. 

శిలాజాల కథా కమామీషు ఏమిటి?

అసలు 1669లో నికోలస్ స్టెనో అనే డానిష్ శాస్త్రవేత్త “ఫ్రోడ్రోమస్‌” పేరుతో తన సిద్ధాంత పత్రం వెలువరించేంత వరకూ ప్రపంచానికి ఇలాంటి శిలాజలు అనే మహత్తర జీవ రూపాంతరాలు కొన్ని భూమిపై ఉన్నాయనే విషయమే తెలియదు. ఆ తర్వాత నెమ్మదిగా వీటిని విస్త్రుతంగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం శిలాజాశాస్త్రం అనేది ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పడింది.

అయినప్పటికీ  ఇంకా వీటి విస్తృతి గురించి ఏయే ప్రాంతాల్లో లభ్యం అవుతున్నాయనే విషయంపై సమగ్రమైన పరిశోధనలు పూర్తికాలేదు. నిజానికి శిలాజాలు విస్తరించినట్లు చూపుతున్న మ్యాప్‌ల్లో సత్తుపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతం లేదు. కానీ ఇప్పుడు వాటిని కనుగొన్నారు. బహుశా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శిలాజాలు ఉనికికి తొలి ఆనవాలు ఇదే. 

శిలాజాలలో రకాలుంటాయా?

ఇలా శిలాజాలుగా ఏర్పడటంలో కూడా రకరకాలున్నా యి. జీవి ఉన్నది ఉన్న ఫళంగా అలాగే శిలాజంగా మారడాన్ని మమ్మిఫికేషన్ అంటారు. అంటే ఈజిస్టియన్ మమ్మీ లను రసాయనాల్లో భద్రపరచినట్లు ఇవి రాళ్లలో భద్రం అవుతాయన్నమాట. అంతే కాకుండా మంచులో కప్పబడిన శిలాజాలు కూడా మరోరకం. చెట్లనుంచి కారే ఒకానొ క జిగురు వంటి ద్రవం రెసిన్‌లో ఇమిడి ఉండే శిలాజాలు ఇంకోలాంటివి. తాబేలు డిప్పలాంటి జీవుల గట్టిభాగాలు శిలాజంగా మారడం కూడా జరుగుతుంది. మరోరకం శిలాజాలూ ప్రత్యేకమైనవే.

దీనిలో జీవి శిలాజంగా మారటం కాకుండా వాటి వల్ల కొన్ని రూపాలు శిలాజాలుగా మారడం అంటే ఉదాహరణకు డైనోసార్ నడిచిన చోట దాని కాలి అచ్చు శిలాజంగా మరోచ్చు. వీటిని బాహ్యరూప శిలాజాలు అంటారు. వీటిలో ముద్రలు, అచ్చులు, పోతలు, శిలీభవనాలు, నొక్కుడుపడ్డ శిలాజాలు, ఖనిజసంబంధ శిలాజాలు , సూక్ష్మ శిలాజాలు  కూడా వున్నాయి. 

శిలాజాలను రక్షించాలి

ఎన్నో కోట్ల ఏళ్ల నాటి ఈ శిలాజ సం పద విలువ తెలి యక వీటిని కేవలం ఒకరకం రాళ్లేమో అనుకుని ఇసుకతోపాటు తరలించడం, పాడుచేయడం. కట్టడాల్లో వాడటం వంటివి చేస్తే ఇవి పరిశీలనలకు సైతం నోచుకోకుండానే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కావునా వెంటనే ఈ ప్రాంతాన్ని శిలాజ వనరులున్న రక్షితప్రాంతంగా ప్రభుత్వ పరిరక్షణలోకి తీసుకుని వీటిపై పరిశోధనలు జరపవలసివున్నది.