calender_icon.png 21 December, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కపాస్‌లో నో చేంజ్

21-12-2025 12:09:24 AM

పత్తి కొనుగోళ్లలో పెరగని 

విక్రయ పరిమితి

దక్కని పూర్తి మద్దతు ధర

తిప్పలు పడుతున్న రైతులు

మహబూబాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన కపాస్ యాప్ ద్వారా పత్తి పండించిన రైతులు కాటన్ కార్పొరేషన్‌కు విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్నారకు. ఎకరానికి ఏడు క్వింటాలుకు మించి కపాస్ యాప్ ద్వారా పత్తి విక్రయానికి అనుమతించకపోవడంతో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు పండించిన పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ ట్రేడర్లకు క్వింటాలుకు రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయించి క్వింటాలకు రూ.వెయ్యికి పైగా నష్టపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర అందించేందుకు కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టింది. ఇందుకోసం గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రత్యేకంగా ‘కపాస్’ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టి పూర్తిగా ఆన్లైన్ విధానంలో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. నాణ్యమైన పత్తికి క్వింటాలుకు రూ.8,110, మధ్య రకానికి క్వింటాలుకు రూ.7,710 ధరను ఖరారు చేసింది. గత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాగు చేసిన పత్తి పంట సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా వేయడానికి ముందుగానే ప్రణాళిక ఖరారు చేసింది.

ప్రతికూల వాతావరణం, అకాల వర్షాలతో పంట దిగుబడి అంచనా వేయడానికి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో హీల్ రిపోర్టు రూపొందించాలని ఆదేశించిం ది. ఆ మేరకు 2023 సంవత్సరానికి 12 క్వింటాలు గరిష్టం గా దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 2024 సంవత్సరానికి ఎకరా పొలంలో కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందని ప్రయోగాత్మ కంగా ఫీల్డ్ సర్వే చేసి అధికారికంగా నిర్ణయించారు. ఈ మేర కు నూతనంగా ప్రవేశపెట్టిన కపాస్ యాప్ ద్వారా పత్తి పం డించిన రైతులు కాటన్ కార్పొరేషన్‌కు విక్రయించడానికి ఆన్లైన్ విధానంలో స్లాట్ బుక్ చేసుకుని సమీప విక్రయ కేంద్రానికి పత్తిని తీసుకువెళుతున్నారు. 

ఎక్కువ దిగుబడితో ఇబ్బందులు

రైతులు సాగుచేసిన విస్తీర్ణం, పంట దిగుబడికి పొంతన లేకపోవడం, ఎకరానికి ఏడు క్వింటాళ్లకు మించి కాపాస్ యాప్ ద్వారా పత్తి విక్రయానికి అనుమతించకపోవడం,  ఒక కిలో ఎక్కువ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తుండటంతో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు పత్తి రైతులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు విక్రయించలేకపోతున్నారు. దీనితో ప్రైవేట్ ట్రేడర్లకు ఆరు నుంచి రూ.౭వేలకు విక్రయించి క్వింటాల్‌కు రూ.వెయ్యి  పైగా నష్టపోతు న్నారు. పత్తి పం ట సాగుచేసిన రైతుల్లో కొందరు పంటను జాగ్రత్తగా సంరక్షించి, దిగుబడి అధికంగా ఇచ్చే రకాలను నాట డం, సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది.

అలాంటి రైతులు కపాస్ ద్వారా సీసీఐకి తమ పండించిన పంట దిగుబడి పూర్తిగా విక్రయించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ దృష్టికి రైతులు తీసుకువెళ్లగా, ప్రభుత్వం మరో మూడు క్వింటాళ్ల వరకు కాటన్ కార్పొరేషన్ ద్వారా అదనంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, మూడు క్వింటాళ్లు పత్తి విక్రయించేందుకు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ధ్రువీకరిస్తే సరిపోతుందని ప్రకటించారు.

కపాస్ యాప్ లో పత్తి విక్రయ పరిమితిని కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు కపాస్ యాప్ లో ఆ మేరకు ‘నో చేంజ్’ సవరణ చేయకపోవడంతో ఏడు క్వింటాళ్ల వరకే పత్తిని విక్రయిస్తున్నారు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లు ఆపైన పండించిన రైతులు 7 క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయించి మిగిలింది ప్రైవే టు ట్రేడర్లకు విక్రయించి నష్టపోతున్నారు. మరికొందరు రైతులు తాము అధికంగా పండించిన పత్తిని, తక్కువగా పండించిన రైతుల పేర్లపై విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ బంధువులు లేదంటే సమీప భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడుకుని వారితో స్లాట్ బుక్ చేయించి , ఓటిపి ద్వారా పత్తి విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఎక్కువ పత్తిని అనుమతిస్తలేరు

ఎకరానికి ఏడు క్వింటాళ్లకు మించి పత్తి పండించిన రైతులు కపాస్ యాప్ ద్వారా పత్తి విక్రయిం చడానికి వస్తున్నారని, వారికి వ్యవసాయ శాఖ ద్వారా అదనంగా పండిన పంట విక్రయించడానికి ధ్రువీకరణ పత్రం ఇస్తే కపాస్ యాప్ అనుమతించడం లేదని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల వ్యవసాయ అధికారి వెంకన్న తెలిపారు. గతంలో ఆన్లై న్ విధానం ద్వారా కొనుగోలు జరిగినప్పుడు విస్తీర్ణం, దిగుబడి, రైతుల వివరాలు, ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు ఏదైనా తప్పులు దొర్లితే సవరించి అప్లోడ్ చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందన్నారు.

మా చేతిలో ఏమీ లేదు

కపాస్ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత యాప్ ద్వారా మాత్రమే పత్తి విక్రయించుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి సవరణలు, పరిమితి పెంచడం లాంటి అంశాలకు తావులేదు. పూర్తిగా సీసీఐ పత్తి కొనుగోళ్లలో కపాస్ యాప్ విధానం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. మా చేతిలో ఇప్పుడు ఏమీ లేదని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ప్రత్యేక హోదా కార్యదర్శి అమరలింగేశ్వర రావు తెలిపారు.

ఎక్కువ పండింది.. 

తక్కువగా కొంటున్నారు

వేసిన పత్తి పంట ను కాపాడి పంట దిగుబడి ఎక్కువ సా ధించాను. నాణ్యమైన పంట దిగుబడి వచ్చి ంది. ప్రభుత్వం ద్వారా విక్రయించి క్వింటాలుకు రూ.8,110 పొందడానికి సీసీఐ ద్వారా కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేశా. కేవలం 14 క్వింటాళ్లకే అనుమతి వచ్చింది. 30 క్వింటాళ్ల పత్తి నాకు పండింది. మా తమ్ముడి ద్వారా మరోసారి స్లాట్ బుక్ చేసి విక్రయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన పత్తిని అగ్గువకు విక్రయించుకొని క్వింటాలుకు వెయ్యి రూపాయల చొప్పున నష్టపోయాను. 

 ఆకుల వెంకన్న, రైతు, నెల్లికుదురు