21-12-2025 12:19:40 AM
ప్రాణాంతక రక్త క్యాన్సర్.. కిమ్స్‌లో చికిత్సతో పూర్తి ఆరోగ్యం
*అసాధారణమైన ఆత్మవిశ్వాసం, నమ్మకం, అత్యున్నత స్థాయి వైద్యం.. ఇవన్నీ కలిపి జాంబియా దేశానికి చెందిన 27 ఏళ్ల నర్సును మృత్యుంజయురాలిగా నిలబెట్టాయి. ఆమె పేరు ముంబా మార్గరెట్. ఆమెకు అత్యం త ప్రాణాంతకమైన ఎక్యూట్ మైలోయిడ్ లుకేమియా (ఏఎంఎల్) అనే రక్త క్యాన్సర్ ఉంది. 2023 సెప్టెంబర్ నెలలో తొలిసారి ఆమెకు క్యాన్సర్ గుర్తించారు. ఆమెకు అత్యాధునిక చికిత్స అవసరమని, రక్తమూలుగ మార్పిడి చేయాలని తెలిపారు. ఎలాగైనాప్రాణాలు నిలబెట్టుకోవాలన్న తపనతో ఆమె వేల మైళ్లు ప్రయాణం చేసి, సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని, కోలుకుని, స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ముంబా మార్గరెట్ ప్రయాణం అంత సులభంగా ఏమీ జరగలేదు. రక్తమూలుగ మార్పిడి చేయడానికి ముందే ఆమెకు టీబీ బయటపడింది. చికిత్స సమయంలో లుకేమియా వచ్చింది. దాంతో మళ్లీ కెమోథెరపీ చేయాల్సి వచ్చింది. ఈలోపు పలుమార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చాయి. ఇలాంటి అనేకానేక సమస్యలతో ముంబా మార్గరెట్ 40 రోజులు ఆస్పత్రిలోనే ఉండి.. అసాధారణమైన ధైర్యంతో తన పోరాటం కొనసాగించారు. ఆమె సమస్య, అందించిన చికిత్స తదితర వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన హెమటో ఆంకాలజీ విభాగాధిపతి, మూలకణ, రక్తమూలుగ మార్పిడి నిపుణుడు డాక్టర్ నరేంద్రకుమార్ తోట, బృందం తెలిపారు.
జూన్ 19న తొలి రక్తమూలుగ మార్పిడి
ఈ ఏడాది జూన్ 19న కిమ్స్ ఆస్పత్రిలో ముంబా మార్గరెట్‌కు తొలిసారి రక్తమూలుగ మార్పిడి చికిత్స చేశాం. కానీ, చికిత్స తర్వాత చాలా తక్కువమంది రోగులకు మాత్రమే వచ్చే అత్యంత ప్రాణాంతకమైన సమస్యలు ఆమెకు వచ్చాయి. వాటిలో డిస్‌ఎలక్ట్రోలైటేమియా.. అంటే రక్తంలో సోడియం, పొటాషి యం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్ లాం టివి విపరీతంగా పెరిగిపోయాయి. దానివల్ల నీరసం, వికారం, వాంతులు, మూర్ఛ, కిడ్నీ వ్యాధుల్లాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫెబ్రైల్ న్యూట్రోపెనియా.. అంటే ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాలు బాగా తక్కువ అయిపోవడం అనే సమస్య కూడా వచ్చింది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేదు.
దాంతోపాటు పోస్టీరియర్ రివర్సిబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్ (ప్రెస్) వల్ల ఉన్నట్టుండి తలనొప్పి, మూర్ఛ, చూపు సరిగా లేకపోవ డం, గందరగోళం, స్పృహ కోల్పోవడం, మెద డు వెనకభాగంలో వాపు లాంటి సమస్యలు వచ్చాయి.ఒకానొక సమయంలో అసలు ఆమె బతికే అవకాశాలు లేవనిపించింది. ముంబాకు ఏడుసార్లకి పైగా కార్డియాక్ అరెస్టులు కావడంతో పదేపదే సీపీఆర్ చేయాల్సి వచ్చేది. ప్రతిసారీ రక్తమూలుగ మార్పిడి, క్రిటికల్ కేర్, కార్డియాలజీ బృందాలు ఆమెను ఎలాగైనా బతికించాలని విశ్వప్రయత్నాలూ చేశాయి. అదే సమయంలో ముంబా మార్గరెట్ సైతం ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అసాధారణ ధైర్యం ప్రదర్శించారు. దానికి తోడుగా ఆమెకు అందిన అత్యున్నత స్థాయి వైద్యం, కిమ్స్ ఆస్పత్రిలో సమన్వయంతో కూడిన వైద్యసేవలు, ఆధునిక సాంకేతికత, నిరంతర అప్రమత్తతతో కూడిన వైద్య బృందం కలిసి పరిస్థితిని ఆమె వైపు తిప్పాయి.
నేడు ఓ ఆశాకిరణం
ఈ రోజు ముంబా మార్గరెట్ ఒక ఆశాకిరణం. అత్యంత ప్రమాదకర లుకేమియా నుంచి వరుస ప్రాణాంతక సమస్యల వరకు అన్నింటినీ జయించి ఆమె తన జీవితాన్ని తిరిగి పొందారు. నెలల తరబడి సాగిన చికిత్సల అనంతరం ఆమె ఆరోగ్యంగా, స్థిరంగా నిలిచారు. స్వదేశం జాంబియాకు తిరిగి వెళ్లేందుకు సంపూర్ణ శక్తితో సిద్ధమయ్యారు. తన కుటుంబ సభ్యులను మళ్లీ కలవాలనే ఆశతో, తన నర్సింగ్ వృత్తిని తిరిగి కొనసాగించాలనే కలలతో ఆమె ప్రయాణానికి సిద్ధమయ్యారు. ముంబా పోరాటం ఆధునిక చికిత్సలకు, కిమ్స్ ఆంకాలజీ విభాగం నిబద్ధతకు నిదర్శనం. ఆస్పత్రిలోని హెమటాలజీ, మూలుగ మార్పిడి బృందాలు, వీటన్నింటితో పాటు.. ఆ యువనర్సు చూపించిన అపారమైన తెగువతోనే ఆమె భవిష్యత్తు నిలిచింది. ధైర్యానికి సరిహద్దులు ఉండవని, సరైన చికిత్సతో బలమైన ఆశ ఉంటే ఎంతటి పోరాటాన్నైనా గెలవవచ్చని ముంబా మార్గరెట్ జీవితం చెబుతోంది.