21-12-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం
పలు కీలక అంశాలపై చర్చ
ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి) : మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయమైన బీఆర్‌ఎస్ భవన్‌కు రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కేసీఆర్ శనివారం సాయంత్రం ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌ను బయలుదేరి హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆదివారం జరిగే సమావేశంలో పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరుతెన్నులపైన ప్రధానంగా చర్చ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు, సర్పంచ్ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రధానంగా నదీ జలాల అంశాలపై ఓ కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని కేసీఆర్ చెబుతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.