calender_icon.png 21 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐతో తెలంగాణ భవిష్యత్

21-12-2025 12:15:13 AM

రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

రెండు, మూడు నెలల్లో 

అధికారికంగా ప్రారంభం

ఐఐటీ మద్రాసుతో ఒప్పందం

కేంద్ర ప్రభుత్వం నుంచి 

రూ. 500 కోట్ల నిధులు

పరిశోధన, స్టార్టప్‌ల ఏర్పాటుకు ఊతం

యువతకు ఉద్యోగాల కల్పన

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రాధాన్యత పెరుగుతున్నది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలూ ఏఐ నైపుణ్యం కలిగిన మానవ వనరుల వైపే దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో యువత ఏఐ నైపుణ్యాల ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా యువత నైపుణ్యాలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నది.

ఏఐ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలవడానికి కీలక ముందడుగు వేసింది. ఐఐటీ మద్రాస్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ(ఎంఈఐటీవై) సహకారంతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ సాంకేతిక అభివృద్ధిలో కొత్త అధ్యయానికి నాంది పలకనుం ది. ఈ సెంటర్ ద్వారా విద్య, పరిశోధన, పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడనుంది. హైదరా బాద్‌ను కేంద్రంగా చేసుకుని, వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట, నిజామాబాద్‌ల్లోని ఐటీఐ కాలేజీలను ఈ ప్రాజెక్టుతో అనుసంధానం చేయనున్నారు. యువతకు అత్యా ధునిక ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ అందించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. 

కేంద్రం నుంచి 500 కోట్ల నిధులు 

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.500 కోట్ల నిధులు కేటాయించనుంది. ఈ నిధులతో  పరిశోధన, డీప్‌టెక్ ఆవిష్కరణలు, స్టార్టప్లకు మద్దతు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణ పాలన, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తరించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్(ఏఐ హబ్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హబ్‌ను 2026 జనవరి నాటికి ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది.

ఈ హబ్ ద్వారా దేశీయ, అంతర్జా తీయ సంస్థలను ఆకర్షించి, తెలంగాణను ఏఐ, డీప్ టెక్ రంగాల్లో జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. తెలంగాణలో ప్రతిపాదిత తెలంగాణ ఏఐ హబ్ (తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్)ను రాబోయే 2 నెలల్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ హ బ్ ద్వారా ఏఐ స్టార్టప్లకు మెంటార్షిప్ అండ్ ఇంక్యుబేషన్, విద్యార్థులు, పరిశోధకులకు ప్రాజెక్ట్ అవకాశాలు, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం, ఏఐ టెక్నాలజీల వాణిజ్యీకరణ వంటి అంశాలకు ఊతమివ్వనున్నారు. టీఏఐహెచ్ ప్రారంభంతో తెలంగాణ రాష్ట్రం ఏఐ, డీప్ టెక్ రంగాల్లో జాతీయ స్థాయిలో కీలక హబ్‌గా ఎదగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) తెలంగాణలో కృత్రిమ మేధస్సు(ఏఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం సమర్పించిన ప్రాథమిక ప్రతిపాదనకు కొనసాగింపుగా, రాబోయే కొన్ని నెలల్లో ఈ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించే దిశగా వివరమైన ఫాలో-అప్ ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ పరిశోధన, అభివృద్ధి, పరిశ్రమలతో భాగస్వామ్యం, ప్రభుత్వ సేవలకు ఏఐ ఆధారిత పరిష్కారాల రూపకల్పన, స్టార్టప్ ఎకో సిస్టంకు మద్దతు అన్నీ ఒకే వేదికపై అమలు చేయనున్నా రు. తెలంగాణను జాతీయ స్థాయిలో ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనను సిద్ధం చేశారు. 

యువతకు కొత్త అవకాశాలు 

ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. స్టార్టప్ ఎకో సిస్టమ్ మరింత బలోపేతం కావడంతోపాటు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న మానవ వనరులు తెలంగాణ నుంచే సిద్ధమవుతాయి. ఐఐటీ మద్రాస్ అకడమిక్ నైపు ణ్యం, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి  ఈ మూడు కలిసి తెలంగాణ భవిష్యత్ టెక్నాలజీ మ్యాప్‌ను మార్చనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, తెలంగాణ ఏఐ హబ్‌లతో రాష్ట్రం కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా, ఏఐ పవర్ హౌజ్‌గా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. 

ఐటీఐ కాలేజీల్లో ఇండియా ఏఐ డేటా ల్యాబ్స్ 

విద్యార్థుల్లో ప్రాథమిక, అనువర్తిత కృత్రిమ మేధ స్సు నైపుణ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో, భారత ప్రభుత్వ ‘ఇండియా ఏఐ మిషన్’ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో ఏఐ డేటా ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి మద్దతు అందిస్తోంది. ఈ కార్యక్రమం కింద తెలంగాణలోని ఐదు ఐటీఐ కాలేజీలు ఏఐ డేటా ల్యాబ్స్ ఏర్పాటుకు ఎంపికయ్యాయి. ఆ  కాలేజీల్లో ఐటీఐ మల్లేపల్లి, హైదరాబాద్, ఐటీఐ కుకునూర్‌పల్లి, ఐటీఐ పెద్దపల్లి, ఐటీఐ సంగారెడ్డి, ఐటీఐ సిద్ధిపేట. ప్రతి ఐటీఐ కాలేజీకి 69 లక్షల చొప్పున నిధులను ఇండియా ఏఐ మిషన్ మంజూరు చేసింది.

ఈ నిధులను ఆధునిక పరికరాల కొనుగోలు, ల్యాబ్ మౌలిక వసతుల ఏర్పాటు, విద్యార్థులకు శిక్షణ మద్దతు, మిషన్ మార్గదర్శకాల ప్రకారం అమలు కార్యక్రమాలకు వినియోగించనున్నారు. తెలంగాణలోని ఐదు ఐటీఐ సంస్థలకు కలిపి మొత్తం 3.45 కోట్ల నిధుల మద్దతు అందనుంది. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ఐటీఐ విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలు అందుబాటులోకి రానుండగా, రాష్ట్రంలో భవిష్యత్ టెక్నాలజీ మానవ వనరుల అభివృద్ధికి ఇది కీలక అడుగుగా నిలవనుంది.

త్వరలోనే ప్రాంతీయ ఏఐ సమ్మిట్ 

2026 ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ముందస్తు కార్యక్రమంగా, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), తెలంగాణ ప్రభుత్వ ఐటీ అండ్ ఈ-గవర్నెన్స్ శాఖతో కలిసి హైదరాబాద్‌లో ప్రాంతీయ ఏఐ సమ్మిట్ నిర్వహించాలని ప్రతి పాదించింది. ఈ సమ్మిట్ ద్వారా దేశవ్యాప్తంగా ఏఐ రంగంలో జరుగుతున్న పరిశోధనలు, విధానాలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి,2026లో జరిగే జాతీయ స్థాయి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు బలమైన పునాది వేయనున్నారు.