10-11-2025 01:46:56 AM
-నెత్తురోడుతున్న హైదరాబాద్- సాగర్ హైవే
-సూచిక బోర్డులు లేకుండా స్పీడ్ బ్రేకర్లు
-అధికారుల తప్పిదం.. ప్రజలకు శాపం
-ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి
-ఆపై చర్యలు తూతూమంత్రం
రాష్ర్టంలో అత్యంత రద్దీగా ఉండే హైవేల్లో అదొకటి. రెండు రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారి. అంతేకాదు హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ తో అనుసంధానం చేసే అత్యంత కీలకమైన మార్గం. బండెనుక బండి.. రద్దీ అంతాఇంత కాదు. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదం. స్పీడ్ వేశారు కానీ సూచికలను మరిచారు. హఠాత్తుగా బ్రేకులు వేస్తే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టాల్సిందే. ఇలా ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. ఇదీ హైదరాబాద్- సాగర్ హైవేపై నిత్యం సాగుతున్న ప్రమాదకర ప్రయాణం. ఇకనైనా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
ఇబ్రహీంపట్నం, నవంబర్ 9 (విజయ క్రాంతి): జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో నిత్యం ఆందోళన కలిగిస్తున్నాయి. సాగర్ ప్రధాన రహదారిపై నిత్యం వేలాది వాహనాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మంగళ్ పల్లి, శేరిగూడ, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉండడంతో ఉదయం, సాయంత్రం కాలేజ్ బస్సుల రద్దీతోపాటు ఇతర వాహనాలతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా వివిధ రకాల వాహనాల డ్రైవర్లు కొందరు మద్యం సేవించి, మరికొందరు సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలు నడపడంతో పాటు చాలాచోట్ల ప్రమాద సూచికలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆగపల్లి వద్ద సాగర్ రహదారిపై లారీ ఢీకొని మేడిపల్లి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కావున సంబంధిత అధికారులు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని వాహన దారులు, ప్రజలు కోరుతున్నారు.
మారని తీరు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కాలేజ్ వద్ద వాహనదారులు ప్రమాదాల బారినపడ్డారు. జాతీయ రహదారిపై స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధనలు ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కనీసం సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో వేగంగా వచ్చే వాహనాలు హఠాత్తుగా వేగం తగ్గిస్తుండగా, వెనుకవచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో ప్రాణాలను సైతం కోల్పోయే ప్రమాదం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం జరిగిన బస్సు ప్రమాదానికి కూడా కారణం ఇదే. ముందు వెళుతున్న బస్సు స్పీడ్‌బ్రేకర్లు కనిపించగానే హఠాత్తుగా వేగాన్ని తగ్గించింది. దీంతో వెనుక నుంచి మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. స్పీడ్ బ్రేకర్లు వేసినప్పటికీ అధికారులు ఎలాంటి సూచిక బోర్డులు పెట్టకపోవడం పట్ల, అధికారుల తీరుపై వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు.
9 నెలల్లో రోడ్డు ప్రమాదాల వివరాలు
పోలీస్ స్టేషన్ కేసులు మృతులు క్షతగాత్రులు
ఇబ్రహీంపట్నం. 59 14 45
మంచాల 24 5 19
యాచారం 40 15 25
ఆదిభట్ల 63 28 35
గ్రీన్ ఫార్మసిటీ 10 2 8
పూర్తి కానున్న బ్రిడ్జ్ నిర్మాణం
శ్రీ ఇందు కాలేజ్ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జ్ నిర్మాణం ఒకవైపు మాత్రమే జరిగింది. దీనికి ఆనుకుని మరోవైపు బ్రిడ్జ్ నిర్మాణ పనులు అతిత్వరలోనే జరగనున్నాయి. బ్రిడ్జ్ పనులు ప్రారంభమై, పూర్తయ్యేంత వరకు ఇదివరకే పూర్తయిన బ్రిడ్జ్ పై నుంచి వన్ వే లో వాహనాల రాకపోకలు సాగనున్నాయి. అయితే ఇందులో భాగంగానే ముందస్తుగా యూటర్న్ ల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఆర్ అండ్ బి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
అధికారులు దృష్టి సారించాలి
శ్రీ ఇందు కాలేజ్ ముందు రోడ్డు ఇరుకుగా మారింది. 50 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు, సుమారు 40 ఫీట్లలోనే ఉన్నది. మిగతా స్థలంలో శ్రీ ఇందు కాలేజ్ కు సంబంధించిన ప్రహరీ గోడ నిర్మించి ఉంది. ఇదివరకు ఇక్కడ ఆర్ అండ్ బి అధికారులు సర్వే నిర్వహించి 50 ఫీట్ల వరకు మార్కింగ్ సైతం చేశారు. ప్రహరి గోడను తొలగించి, వెనక్కు జరపాల్సిందిగా సూచించినప్పటికీ కాలేజ్ యాజమాన్యం అక్కడ ఎలాంటి మార్పు చేయలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కావున అధికారులు దీనిపై దృష్టి సారించాలి .
ఈర్లపల్లి సునీత వెంకట్ రెడ్డి, మాజీ కౌన్సిలర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ
రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి
స్పీడు బ్రేకర్స్ వద్ద ఏలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవమే. దీనిని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ప్రమాదాలు జరగకుండా స్పీడు బ్రేకర్స్, వైట్ పెయింట్ వేయడం జరిగింది ఎంఎం. కావున వాహనదారులు ఇది గమనించి, అతివేగం తగ్గించి సురక్షితంగా ప్రయాణించాలి. స్పీడు బ్రేకర్స్, మూల మలుపులు ఉన్న చోట అతివేగము తగ్గించాలి, రోడ్డు భద్రత నియమ నిబంధనలు వాహనదారులు తప్పనిసరిగా పాటించాలి.
జితేందర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ, ఇబ్రహీంపట్నం