calender_icon.png 10 November, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాసిపెట్టుకోండి.. 2034 వరకు.. అధికారం మాదే

10-11-2025 12:52:56 AM

సినిమాలో ఐటెం సాంగ్‌లా కేటీఆర్ ప్రచారం

  1. కేటీఆర్ అరెస్టు కోసం గవర్నర్ నుంచి అనుమతి రాలేదు
  2. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదు?
  3. ఉప ఎన్నికల విషసంస్కృతిని కేసీఆరే తెచ్చిండు..
  4. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : ‘రాసిపెట్టుకోండి.. 2034 జూన్ వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉం టుంది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉంది. మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను కొనసాగిస్తూనే అదనంగా కొత్త పథకాలు తీసుకొచ్చాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ పెట్టే విష సంస్కృతిని తీసుకొచ్చింది కేసీఆరేనని విమర్శించారు.

గతంలో పీజేఆర్ చనిపోయినప్పుడు కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికలు తెచ్చారని, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి విషయంలోనూ అదే విష సంస్కృతిని తెచ్చారని సీఎం మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ హోటల్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఫేక్ సర్వేలను ఎవరు పట్టించుకోవద్దని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్‌కు ఏటీసీ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 2028 డిసెంబర్‌లో ఎన్నికలు రావని, 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు. బీజే పీ, బీఆర్‌ఎస్ విలీనాన్ని తాను అడ్డుకున్నానని కవితనే చెప్పిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్‌తోనే బీఆర్‌ఎస్ పని అయిపోందని, జూబ్లీహిల్స్‌లో గెలిపించాలని కేసీఆర్ ఇప్పటివరకు విజ్ఞప్తి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

తన కళ్ల ముందే బీఆర్‌ఎస్ కూలిపోతుంటే కేసీఆర్ మౌనంగా కుమిలిపోతున్నారని అన్నారు. ఎన్నికల విషయంలో నాది లీడర్ మైండ్‌సెట్ కాదని, క్యాడర్‌మైండ్‌సెట్ అని సీఎం చెప్పారు. ఫార్ములా వన్ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి కోరామని, 3 నెలలు అవుతున్నా గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని  సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

కాళేశ్వరం విచారణను సీబీఐకి తాము అప్పగించామని, ఇంతవరకు కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు విచారణ ప్రారంభించలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధం. జూబ్లీహిల్స్‌లో బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే దేశం మొత్తం బీజేపీ గెలిచినట్లే. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆత్మహత్య  చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది. కేసీఆర్, హరీష్‌రావు ప్రాతి నిధ్యం వహిస్తున్న మెదక్‌కు కూడా బీజేపీకి బీఆర్‌ఎస్ నేతలు కట్టబెట్టారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుని అవయవదానం చేస్తారా..?’ అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. 

 అగ్రికల్చర్ ఎవరిదో.. డ్రగ్స్ కల్చర్ ఎవరిదో..

ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చ రో ప్రజలు ఆలోచించుకోవాలని, గల్లీలో గంజాయి తీసుకొచ్చింది ఎవరో ఆలోచించాలి. ఎవరిది పబ్ కల్చరో.. ఎవరిది సామా న్యులతో కలిసే కల్చర్ ఎవరిది. సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చరో ప్రజలు ఆలోచించాలి అని సీఎం పేర్కొన్నారు సెంటిమెంటా, డెవలప్‌మెంటా.. జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్నారు.

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తనపై చేస్తున్న విమర్శలు, రోడ్ షోలల్లో చేస్తున్న డ్యాన్స్‌లు.. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్‌లాగా ఉన్నాయన్నారు. శ్రీలీల ఐటమ్ సాంగ్ కు.. కేటీఆర్ ప్రచారానికి ఏమి తేడాలేదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సచివా లయం, కమాండ్ కంట్రోల్ రూమ్‌లను క ట్టారని, వాటి వల్ల ఎవరికి ఉపయోగం..? ఎవరిపై నిఘా కోసం..? ఎవరి వాస్తు కోసం వాటిని నిర్మించారు..? అని సీఎం ప్రశ్నించారు. కేటీఆర్ దశ, దిశ సరిగ్గా లేనప్పుడు వాస్తు మారిస్తే ఏమొస్తుందని, కేటీఆర్ జీవితంలో ఆ రేఖనే లేదని తెలిపారు.  

కేసీఆర్ దృతరాష్ర్టుడు..

కేసీఆర్ దృతరాష్ర్టుడని, కళ్లకు గంతలు కట్టుకున్న చందంగా వ్యవహారిస్తున్నారని సీ ఎం విమర్శించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా..? తమ ప్రభుత్వం హ యాంలో కాళేశ్వరం లేకపోయినా 2.85 కో ట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా..? ఉ న్న వాటికి కనీసం వీసీలను నియమించలేదని, 5 వేల పాఠశాలలు మూసివేశారని తెలి పారు.

పేదలకు విద్య, రైతులకు వ్యవసా యం, మహిళలకు రాజ్యాధికారాన్ని కేసీఆర్ దూరం చేశారని రేవంత్‌రెడ్డి  మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 1.87 లక్ష కోట్ల ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని సీఎం ప్ర శ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని కట్టలేదు, టిమ్స్‌లను పూర్తి చేయలేదన్నారు. 

రెండేళ్లలో ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం.. 

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమి చేయలేదనడం సరికాదన్నారు. ఇప్పటీ వరకు ఎంతో చేశామని, భవిష్యత్‌లొనూ మరింత అభివృద్ది, సంక్షేమాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  ‘కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రూ. 7,100 కోట్ల ఖర్చు చేశాం. రేషన్ కార్డులు, సన్న బియ్యం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్. రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ. 10 లక్షల వరకు పెంపు.  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

యంగ్ ఇండియా, స్పోర్ట్స్ యూనివర్సిటీ. రూ. 3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నాం. రూ. 21 వేల కోట్ల రైతు రుణమాఫీతో పాటు తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా అందించాం. యంగ్ ఇండియా రెసిడెన్సీయల్ స్కూల్స్  నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌కు 20 టీఎంసీల గోదావరి నీళ్లు తెచ్చే ప్రణాళికలు తయారు చేశాం. మేం అధికారంలోకి వచ్చాక 20 వేలకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేశాం. 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం ’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. 

నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్.. 

తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంత త్యాగం చేసిందో రాష్ట్ర ప్రజలకు తెలుసని సీఎం పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో  నిర్ణయాలు తీసుకున్నదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగడం వల్లే రాష్ట్ర విభజనకు ఏపీ వాళ్లు ఒప్పుకోలేదని, రాష్ట్ర విభజన తర్వాత చివరకు హైదరాబాద్‌లో వాటా అడిగారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతోనే హైదరాబాద్ నాలెడ్జ్ హబ్‌గా మారిందన్నారు. సీఎంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్ కోసం తొలి  సంతకం, రైతులపై కేసుల మాఫీతో పాటు రూ. 1,300 కోట్ల రైతు వ్యవసాయ బిల్లుల బకాయిలను రద్దు చేశారని సీఎం వివరించారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలని ఉచిత కరెంటును తీసుకొచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి   గుర్తు చేశారు. 

గ్లోబల్ కంపెనీల్లో 70 శాతం.. 

 ‘తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలే. తుమ్మడిహెట్టి, ప్రాణహిత ఎస్సారెస్సీ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల తదితర ప్రాజెక్టులను రాష్ట్ర ప్రయోజనాల కోసం జలయజ్ఞంలో భాగంగా పదేళ్లు ప్రణాళికలు రచించి వేగంగా పూర్తి చేసేందుకు అప్పటి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేసింది. ఒకప్పుడు ఎండాకాలంలో మంచినీటికి తీవ్ర ఎద్దడి ఉండేదని, కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష హోదాలో పి. జనార్దన్‌రెడ్డి పోరాటం చేసి సాధించారు.’ అని సీఎం వివరించారు. 

‘ రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించి పదేళ్లు పట్టం కట్టారు. పదేళ్ల తర్వాత ప్రజాపాలన వచ్చిందని, తమ రెండేళ్ల పాలనలో కేసీఆర్ చెరిపేస్తే చెరిగిపోయేవి కావు. పంటకు కనీస మద్దతు ధరను తీసుకొచ్చి రైతులను కాపాడం. కానీ, గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు కొల్లగొటింది. నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్ మారినందుకు కాంగ్రెస్ పాలసీలే కారణం. హైదరాబాద్‌కు దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్, నీళ్లు ఇవ్వడం ద్వారా సాధ్యమైంది. దేశంలోని గ్లోబల్ కంపెనీల్లో 70 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పాలసీలే తెలంగాణ గ్రోత్ ఇంజిన్స్‌గా మారాయి ’ అని తెలిపారు. 

నిబంధనలు పాటించిన కాలేజీలకు.. 

తనను బెదిరించడానికే కాలేజీలను బంద్ చేశారని, ఆరు నెలల పాటు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏమి కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. విద్య వ్యాపారం కాదని, సేవ అని తెలిపారు.100 శాతం రూల్స్ పాటించే కాలేజీలకే తక్షణం బకాయిలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.  ఫీజులు ఇస్తారా లేదా అని బంద్ చేయించి బెదిరిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతాలు, పట్టింపులకు పోతే సమస్య పరిష్కారం కాదన్నారు. నిబంధనల ప్రకారం వెళ్లడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రెసెక్లబ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శి శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, వరికుప్పల రమేష్  తదితరులు పాల్గొన్నారు.  

గుజరాత్‌కు గులాంగిరీ.. 

సొంత చెల్లి  కవితను, మాగం టి గోపినాథ్  తల్లిని కేటీఆర్ ఆవమానించారని సీఎం రేవంత్‌రెడ్డి విమ ర్శించారు. సొంత కుటుంబాన్నే సరి గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని చూ సుకుంటాడా..? అని నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తని కిషన్‌రెడ్డి.. గుజరాత్‌కు గులాంగిరీ చేస్తూ .. తనపై ఒంటికాలిపై లేస్తున్నారని సీఎం వ్యాఖ్యా నించారు. తనపై ఎగిరితే ఏమి రాద ని, ఏమన్నా ఉంటే మోదీ దగ్గర మా ట్లాడాలని కిషన్‌రెడ్డికి సీఎం సూచించారు. కేటీఆర్‌తో  కిషన్‌రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారని, వీరిద్దరు తో డుదొంగలని సీఎం రేవంత్‌రెడ్డి  దు య్యబట్టారు. మూసీ ప్రక్షాళన, మె్ర టో విస్తరణకు ఎందుకు సహకరించడం లేదని మండిపడ్డారు.