calender_icon.png 10 November, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్‌ఎస్‌కు గుర్తింపే లేకుంటే గతంలో ఎలా నిషేధించారు?

10-11-2025 12:46:38 AM

కులమతాలను పక్కనపెట్టి భరతమాత బిడ్డలుగా సంఘ్‌లోకి రావచ్చు

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

బెంగళూరు, నవంబర్ 9 : ప్రతిపక్షాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను గుర్తింపులేని సంస్థ గా చెప్పుతున్నాయని, అలాంటప్పుడు గుర్తింపు లేని సంస్థను గతం లో మూడుసార్లు ఎలా నిషేధించారని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌పై చేస్తున్న విమర్శలకు భగవత్ బదులిచ్చారు.

విధానాలు, సిద్ధాంతాలను బట్టి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉం టుందే కాని వ్యక్తులకు లేదా ఏదైన రాజకీయ పార్టీకి అండగా నిలవడమంటూ ఉండదని ఆయన చెప్పారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే డిమాండ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలిపివుంటే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి మద్దతు తెలిపేవారని అన్నారు. ‘ఏ రాజకీయ పార్టీ మాది కాదు.. అన్ని పార్టీలు మావే.. ఎందుకంటే అవి భారతీయ పార్టీలు.

మేం రాష్ట్రనీతికి మద్దతు తెలుపుతామేగాని, రాజ్‌నీతికి కాదు. ఈ దిశగా దేశాన్ని నడిపేవారికి మేం మద్దతిస్తాం. ఇతను బ్రాహ్మణుడని ఒక కులం పేరుతోనో, ఇతను ముస్లిం మతస్థుడు లేదా క్రైస్తవ మతస్థుడు అనో మేం సంఘ్‌లో చేర్చుకోం. తాము భరతమాత బిడ్డలమని భావించేవారినే సంఘ్ శాఖలో చేర్చుకుంటాం. వారు ఏ కులస్థులనో, ఏ మతస్థులనో మేం అడగం’ అని భగవత్ చెప్పారు.

100 సంవత్సరాల సంఘ్ వేడుకల్లో భాగం గా బెంగళూరులో న్యూ హారిజన్స్ అనే రెండు రోజుల కార్యక్రమంలో ఆదివారం భగవత్ ప్రసంగించారు. హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదని, అదేవిధంగా తాము కూడా ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ఆర్‌ఎస్‌ఎస్ బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘సంఘ్ 1925లో ప్రారంభమైంది.

మేం బ్రిటిష్ ప్రభుత్వంలో నమోదు చేసుకోవాలని మీరు ఆశిస్తున్నారా? ఎవరికి వ్యతిరేకంగా?.. మమ్మల్ని మూడుసార్లు నిషేధించారు. ఈ నిషేధాలతోనే వారు ఆర్‌ఎస్‌ఎస్‌ని చట్టపరమైన సంస్థగా గుర్తించారు’ అని ఆయన వివరించారు. ‘చట్టబద్ధంగా, వాస్తవంగా, మేం ఒక సంస్థ. అంతేకానీ మేం రాజ్యాంగానికి  వ్యతిరేకం కాదు. మేం ఆ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నాం. మా చట్టపరమైన హోదా ఆ రాజ్యాంగంలోనే ఉంది. కాబట్టి మేము ప్రతేకంగా రిజిస్ట్రేషన్  చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తెలిపారు.