23-07-2025 10:58:28 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): ఈత సరదా ఓ యువకుని ప్రాణం తీసింది.స్నేహితులతో కలిసి సీతారామ ప్రాజెక్టు(Sitarama Lift Irrigation Project) కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై మేడా ప్రసాద్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పినపాక పట్టి నగర్ గ్రామానికి చెందిన నందు, శివ, బాబు పాత పినపాక సమీపంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కాలువకు ఈతకు వెళ్లారు. అందులో ఒకరికి ఈత కొట్టేందుకు రాకపోవడంతో ఒడ్డుపైనే ఉన్నాడు. నందు, శివ కాలువలోకి దూకారు. నందు ఒడ్డుపైకి చేరుకోగా.. శివ నీళ్లలో మునిగి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు వారి కుటుంబ సభ్యులకు తెలుపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మేడా ప్రసాద్ సిబ్బంది, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు.