calender_icon.png 19 December, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై యమపాశాలు

19-12-2025 12:25:00 AM

  1. ప్రధాన రహదారిపై టిప్పర్ల ప్రళయం
  2. అధిక లోడు, వేగంతో ప్రమాదాలు
  3. రోడ్డుపై నిత్యం జారిపడుతున్న బొగ్గు పెళ్లలు
  4. దుమ్ముతో అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు
  5. రక్షణ చర్యలు చేపట్టని సింగరేణి అధికారులు
  6. హై స్పీడ్ ఫుల్, లైసెన్స్ నిల్..
  7. పట్టింపేలేని రవాణాశాఖ అధికారులు

మణుగూరు, డిసెంబర్18 (విజయ క్రాంతి): మణుగూరు, భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రధాన రహదారి ఫై బొగ్గులారీలు వస్తున్నాయంటే  ప్రజలు హడలిపోతున్నారు. లారీల దూకుడు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం  పొంచి ఉందో అనే ఆందోళన చెందుతున్నారు. ప్రధానం గా మణుగూరులో అంతర్గతంగా బొగ్గును సరఫరా చేసే లారీల దూకుడుకు తోడు మణుగూరు ఓసీ, ఓసీ-2 నుంచి బొగ్గును బీటీపీఎస్కు బొగ్గు తరలించే టిప్పర్ల అతి వేగం మిగతా వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతోంది.

బొగ్గు టిప్పర్లతో ప్రాణహాని ఉండడమే కాక పర్యావరణం దెబ్బతింటోందనే ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. మణుగూరు టూ ఏటూరు నాగారం ప్రధాన  రహదారి అంటేనే వాహన శోధకులతోపాటు, కార్మిక, కార్మికేతర కుటుంబాలు జంకుతున్నాయి. ఓ వైపు గుంతలు.. మరోవైపు వాహనాల రద్దీ. దీనికి తోడు బొగ్గు తరలించే టిప్పర్ల లారీ  అతివేగం, డైవర్ల ఇష్టారాజ్యం ప్రజల  ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోడ్లపై యమపాశాలు నిలుస్తున్న బొగ్గు లారీలఫై విజయక్రాంతి కథనం..  

రహదారిపై టిప్పర్ల ప్రళయం..

మణుగూరు నుంచి బీటీపీఎస్కు వెళ్లే లారీలు ట్రిప్పుల లెక్కన నడుస్తుండటం తో ఈ లారీలను  నడిపే డ్రైవర్లు వేగానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. మరో వైపు మణుగూరు నుండి బీటీపీఎస్ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం  ప్రమాదాలకు నెలవుగా మారింది. బొగ్గు లారీల ద్వారా కింద పడే బొగ్గు పెళ్లలు నుజ్జుగా మారి విపరీతమైన దుమ్ము ధూళికీ తోడు లారీల వెనక ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు కంటి నిండా బొగ్గు చూర పడడంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. లారీలపై టార్పాలిన్లు కట్టడం లేదు. పైగా బొగ్గును కూడా లారీ బాడీకి సమాంతరంగా కాకుండా హెచ్చుగా పోయడం వల్ల మూలమలుపుల్లో  బొగ్గు పెల్లలు రహదారిపై పడడంతో తరచూ ప్రమాదాలు జరుగున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

రెండు నిమిషాలకో టిప్పర్..

 మణుగూరు, బిటిపిఎస్  ఈ మార్గంలో రెండు నిమిషాలకో టిప్పర్ చొప్పున బొగ్గు తీసుకుని పరుగులు తీస్తుంటాయి. సీరియల్ పోతుందని.. రోజుకు ఒక్కో టిప్పర్ నాలుగు నుంచి ఐదు ట్రిప్పులు వేయాల్సి రావడం, గంటలోపు గమ్యాన్ని చేరుకోవాలనే ఆతృతతో డ్రైవర్లు వేగంగా నడుపుతుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ మార్గంలో బొగ్గు టిప్పర్లు ఢీకొని అనేక మంది మృతి చెందగా,మరికొందరు తీవ్రగాయాలతో మంచానికే పరిమితమయ్యారు.

కమ్మేస్తున్న దుమ్ము..

బొగ్గు తరలించే సమయాన టిప్పర్ల నుంచి బొగ్గు పెళ్లలు రోడ్డుపై పడకుండా పట్టాలను కప్పాల్సి ఉంటుంది. కానీ త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో పట్టాలను కప్పక బొగ్గు పెళ్లలు రోడ్డు పై పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అంతేకాక బొగ్గు దుమ్ము ఎగిసిపడు తుండడంతో వెనక వచ్చే ద్విచక్ర వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు. బొగ్గు రవాణా టెండర్లలో విధిగా పట్టాలు పూర్తిగా కప్పాలనే నిబంధన ఉన్నా డ్రైవర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాక నల్లటి దుమ్ము లేస్తుండడంతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశముందని తెలిసి కూడా పట్టించుకోకపోవడం గమ నార్హం.

తనిఖీలు చేయరా..?

కొందరు టిప్పర్ చోదకులు పరిమితిని మించి బొగ్గు లోడును తీసుకెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లారీల వేగాన్ని, అధికలోడ్ను నియంత్రించి, సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. భద్రాద్రి పవర్ ప్లాంట్కు బొగ్గు రవాణా చేసే లారీల డ్రైవర్లకు ఒక్కరికి కూడా లైసెన్స్ లేదని.. మద్యానికి అలవాటుపడి వాహనాలు తోలుతుంటే రవాణాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రవాణాశాఖ  అధికారులు చర్యలు తీసుకుంటే కొంతమేరైనా ప్రమాదాలను నివారించ వచ్చునని, ఆ దిశగా ఆ శాఖ అధికారులు  ఇప్పటికైనా బొగ్గు లారీలపై చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా రు.