calender_icon.png 19 December, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహపురం గ్రామపంచాయతీ ఓట్లను రీకౌంటింగ్ చేయాలి

19-12-2025 12:24:14 AM

నరసింహపురం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ కమలమ్మ 

సూర్యాపేట, డిసెంబర్ 18 (విజయక్రాంతి) / మోతె : తమ గ్రామంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని సర్పంచ్ చేశారని తాము ఓట్లను రీకౌంటింగ్ పెట్టమని కోరినప్పటికీ మా విన్నపాన్ని లెక్కచేయకుండా నాకు తీవ్ర అన్యాయం చేశారని ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామ ఓట్లను రీకౌంటింగ్ పెట్టించాలని మోతే మండలం నరసింహపురం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ కమలమ్మ, ఉప సర్పంచ్ బొల్లం యలమంచయ్య లు డిమాండ్ చేశారు.

గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నరసింహపురం గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తాను కత్తెర గుర్తుపై, రెబల్ అభ్యర్థి బేబీ బ్యాట్ గుర్తుపై పోటీ చేశామన్నారు. పోలింగ్  ముగిసి కౌంటింగ్ చేపట్టిన అధికారులు తమకు 508 ఓట్లు, రెబల్ అభ్యర్థికి 507 ఓట్లు రాగ అప్పటికప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓటు రెబల్ అభ్యర్థికి వచ్చిందంటూ అధికారులు ఓట్లను సమానం చేశారని తెలిపారు.

ఈ విషయమై అధికారులు ఇరువురి మధ్య డ్రా తీసి గెలుపు నిర్ధారిస్తామని తమకు చెప్పగా తాము అందుకు అంగీకరించలేదనీ రీకౌంటింగ్ పెట్టాలని కోరినట్లు తెలిపారు. దీంతో అధికారులు గంటల తరబడి ఫోన్లో మాట్లాడి వచ్చి తమకు చూపకుండానే డ్రా తీసి రెబల్ అభ్యర్థి బేబీని సర్పంచ్ గా ప్రకటించారని తాము రికౌంటింగ్ చేపట్టమని ఎన్నిసార్లు వేడుకున్న రీకౌంటింగ్ చేపట్టలేదన్నారు.

దీంతో తనకు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లి ఈ రోజే వచ్చి ఈ విషయమై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.  తమకు ఓట్లు అధికంగా వచ్చాయని రీకౌంటింగ్ పెడితే తామే గెలుస్తామనే అక్కస్సుతో అధికారులు రికౌంటింగ్ పెట్టకుండా తక్కువ ఓట్లు వచ్చిన రెబల్ అభ్యర్థిని సర్పంచ్ గా ప్రకటించార న్నారు.

అభ్యర్థులు ఎవరు పోటీలో ఉన్న న్యాయంగా వ్యవహరించవలసిన అధికారులు తమ విషయంలో నిబంధనలను తుంగలో తొక్కి తమకు అన్యాయం చేశారని ఈ విషయమే తాము కోర్టుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు స్పందించి నరసింహ పురం గ్రామంలో ఓట్లను రీకౌంటింగ్ పెట్టించి తమకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వాంకుడోత్ పొట్ట, వాంకుడోత్ తిరుపతి, గుగులోతు నరేష్, మల్సూర్, శ్రీను, వాంకుడు వెంకన్న, ముంత లింగయ్య, దొడ్డి రవి తదితరులు ఉన్నారు.