calender_icon.png 28 October, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే వేసవిలో విద్యుత్‌కు డిమాండ్

26-10-2025 12:27:21 AM

19 వేల మెగావాట్లకుపైగా అవసరమని ప్రిన్సిపల్ సెక్రటరీ అంచనా

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి) : వచ్చే వేసవిలో రికార్డు స్థాయిలో విద్యుత్‌కు డిమాండ్ నమోదయ్యే అవకాశాలు న్నాయని, అందుకు అనుగుణంగా విద్యుత్తు సంస్థలు సిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్  ఆదేశించారు. శనివారం దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) కార్యాలయంలో ట్రాన్స్‌కో చైర్మన్ కృష్ణభాస్కర్, జెన్‌కో సీఎండీ హరీష్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఎస్‌పీడీసీఎల్  సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, రెడ్‌కో వీసీఎండీ అనిల్‌తోపాటు విద్యుత్తు సంస్థల డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

2026 వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా గరి ష్ట విద్యుత్తు డిమాండ్ 19000 మెగావాట్లను దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో లైన్ల మరమ్మతులు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది దక్షిణ డిస్కం పరిధిలో 72, ఉత్తర డిస్కం పరిధిలో 31 సబ్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నామని వివరించారు.

ట్రాన్స్‌కో పరిధిలో 181 ఈహెచ్‌టీ సబ్ స్టేషన్లు ఉన్నా.. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నట్టు తెలిపారు. అదనంగా దక్షిణ డిస్కంలో 8384, ఉత్తర డిస్కం పరిధిలో 5280 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కొద్ది నెలల్లోనే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని అన్ని యూనిట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతిరోజూ 1.8 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నామని, నవంబర్ నాటికి ప్రతిరోజూ 2.20 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. దక్షిణ డిస్కం పరిధిలో ఈ డ్రైవ్‌లో భాగంగా చేస్తున్న సర్వేలో అక్టోబర్ 2025 నాటికి 3121 ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించామని, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.