28-10-2025 01:50:52 PM
వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్నాం
లక్షల కొద్ది పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం
ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అందరికీ ఉపయోగపడేలా పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని రూపొందిస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రాంగణంలో సిడిఎంఎ నిధులు రూ 10 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించారని, ఇలాంటి మంచి వాతావరణంలో అత్యున్నతమైన ప్రదేశంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఒక నాలెడ్జ్ సెంటర్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో శంకుస్థాపనలు చేయడం జరిగిందని, పూలే అంబేద్కర్ శంకుస్థాపన చేసినంత ఆనందం ఇప్పటి వరకు తనకు ఎప్పుడు కలగలేదన్నారు. అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే విధంగా విజ్ఞాన కేంద్రం తీర్చిదిద్దుతామని తెలిపారు. ఫూలే ఆదర్శ దంపతులను , రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహించుట కోసం హాల్స్ నిర్మాణం చేస్తామని చెప్పారు.