19-11-2025 11:35:07 PM
సూర్యాపేట జిల్లాకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్ ఎస్ పి) రెండవ దశ కాలువకు బి.ఎన్ రెడ్డి పేరు పెట్టాలి..
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి
ఏఐకేఎఫ్, -ఏఐఏడబ్ల్యూఎఫ్ ఇందిరాపార్క్ ధర్నాలో వక్తల డిమాండ్
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల విముక్తి కోసం సర్వం త్యాగం చేసిన ప్రజాయోధుల త్యాగాలను ఆదర్శాలను విస్మరిస్తే ఎంతటి నాయకులైన, ప్రభుత్వాలైన పతనం కాక తప్పదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్ డీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్), అఖిలభారత వ్యవసాయ కార్మిక సమాఖ్య (ఏఐఏ డబ్లుఎఫ్) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వమని చెప్తున్న రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో తెలంగాణ ప్రజల విముక్తి కోసం జీవితాలను అర్పించి అనేక నిర్బంధాలను అణిచివేతలను తట్టుకొని నీతి, నిజాయితీగా విలువలకు కట్టుబడి పనిచేసిన వీర తెలంగాణ రైతాంగ ఉద్యమ యోధులను చరిత్రను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని, అందుకు ప్రత్యక్ష నిదర్శనమే శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువకు ఏమాత్రం సంబంధంలేని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ప్రకటించడం అని ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి లేదని అన్నారు. నిజాం రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్య నింపి భూమి బుక్తి విముక్తి కోసం నిరంతరం పనిచేసి సాధించిన గొప్ప వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి అని అన్నారు.
రాజకీయాలను వ్యాపారంగా మార్చుకొని విలువలకు తిరోధకాలిచ్చి త్యాగధనుల ఆదర్శాలను విలువలను తుంగలో తొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవరిస్తున్నదని ఈ పద్ధతులను మానవకపోతే ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా వరంగల్ నల్లగొండ ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సాగు త్రాగునీటి కోసం చట్టసభలలో వీధులలో పోరాటాలు నిర్వహించి శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువ నిర్మాణం ద్వారా 4.30 లక్షల ఎకరాల కు సాగునిరు అందించి ప్రజలకు త్రాగునీరు అందించే కృషి చేశారని అందుకని ఆ కాలువకు బిఎన్ రెడ్డి పేరు నామకరణం చేయాలని సూర్యాపేట జిల్లాకు బి.యన్ రెడ్డి జిల్లాగా మార్చాలని ట్యాంక్ బండ్ పై కాంస్య విగ్రహం, ఐదు ఎకరాలు కేటాయించి స్మృతి వనం ఏర్పాటు చేయాలని పాఠ్యాంశాలలో చేర్చాలని తద్వారా ప్రభుత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. శ్రీరామ్ సాగర్ రెండో దశ కాలువకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన పేరును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో బిఎల్‌ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఏఐకేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెద్దారపు రమేష్, హైకోర్టు న్యాయవాది నరసింహారావు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్రాలు నాయకులు వరికుప్పల వెంకన్న, గోనె కుమారస్వామి జక్కుల వెంకటయ్య, వనం సుధాకర్, వంగల రాగసుధ, ఎన్ రెడ్డి హంసారెడ్డి, తుకారాం నాయక్, షేక్ నజీర్, గడ్డం నాగార్జున, మంద రవి, కుసుంబ బాబురావు, చాకలి ఐలమ్మ మనవరాలు శ్రీమతి శ్వేత, గుండెబోయిన చంద్రయ్య, కొత్తగట్టు మల్లయ్య, బి.ఎన్ రెడ్డి కుమారుడు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేన అల్లుడు మల్లు కపోతం రెడ్డి, మేనకోడలు పాతూరి కరుణ, ప్రజా సంఘాల నాయకులు కన్నం వెంకన్న, పల్లె మురళి, తుడుము అనిల్ కుమార్, కర్ర రాజిరెడ్డి, అంగడి పుష్ప,కంచె వెంకన్న, కనకం సంధ్య, మాస్ సావిత్రి, పోతుగంటి కాశి, జబ్బర్ నాయక్, తాండ్ర కళావతిలతో పాటు వందలాది మంది పాల్గొన్నారు.